Yashasvi Jaiswal : భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మరోసారి అద్భుతంగా రాణించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా తరపున జైశ్వాల్ కేవలం 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే, చిన్న తేడాతో తను ఓ పెద్ద రికార్డును మిస్ చేసుకున్నాడు. యశస్వి జైశ్వాల్ 2000 టెస్ట్ పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అతను ఆ మార్క్‌ను దాటి ఉంటే, అత్యంత వేగంగా 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేసి ఉండేవాడు.
ప్రస్తుతం జైశ్వాల్ తన కెరీర్లో తన 39వ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతను 2000 పరుగుల మార్క్‌ను దాటి ఉంటే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ ల రికార్డును అధిగమించి ఉండేవాడు. వీరిద్దరూ 40 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నారు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌లలోనే, జైశ్వాల్ ఇప్పటికే 1990 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 12హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లలో తన ఎంట్రీ టెస్టుల్లోనే సెంచరీలను సాధించాడు.
యశస్వి జైశ్వాల్‌కు ఇంగ్లాండ్‌పై ఆడడం బాగా నచ్చినట్లుంది. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత, రెండో టెస్టులో ఏకంగా 87 పరుగులు చేశాడు. గతేడాది ఇంగ్లాండ్ భారత్‌లో పర్యటించినప్పుడు కూడా జైశ్వాల్ ఆ సిరీస్‌లో అద్భుతంగా ఆడి, ఐదు మ్యాచ్‌లలో రెండు డబుల్ సెంచరీలు బాదాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ బ్యాట్‌తో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ, సెంచరీని చాలా తక్కువ తేడాతో మిస్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో 87 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వచ్చిన జైశ్వాల్, రాహుల్ కేవలం 2 పరుగులకే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. స్కోరు 15 పరుగుల వద్ద రాహుల్ ఔటైనప్పటికీ, జైశ్వాల్ ఎటువంటి ఆందోళన లేకుండా ఆడాడు.
తను మొదట కరుణ్ నాయర్‌తో, ఆపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కీలక పార్టనర్ షిప్ బిల్డ్ చేశాడు. భారత్‌ను మంచి స్థితికి చేర్చాడు. జైశ్వాల్ దూకుడు ఆటతీరు ఇంగ్లాండ్ బౌలర్లను కలవరపెట్టింది. అయితే, 46వ ఓవర్‌లో స్టోక్స్ స్వయంగా బౌలింగ్‌కు వచ్చి మొదటి బంతికే వికెట్ తీశాడు. అతని మొదటి డెలివరీకే జైశ్వాల్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైశ్వాల్ 107 బంతుల్లో చేసిన 87 పరుగుల ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు ఉన్నాయి. డే 1లో భారత్ మంచి స్కోరు సాధించడంలో జైశ్వాల్ కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..