Headlines

World Record : టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం

World Record  : టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం


World Record : ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై సాధించిన విజయంతో టీమిండియా కేవలం టోర్నీని గెలుపుతో ప్రారంభించడమే కాదు, క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకానొక దశలో ఓటమి భయం వెంటాడినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత పోరాటంతో భారత్ ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనతను టీమిండియా సాధించింది. 2024 ప్రపంచకప్‌లో వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు 2026 టోర్నీలో అమెరికాపై సాధించిన గెలుపుతో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు వరుసగా 8 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండేవి. కానీ, వాంఖడే పోరుతో ఆ రికార్డులను చెరిపివేసి భారత్ ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ చారిత్రక విజయం వెనుక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కృషి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, పసికూన అమెరికా బౌలర్ల ముందు విలవిలలాడింది. కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం ద్వారా 19 ఏళ్ల క్రితం గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న అనవసర రికార్డును (ప్రపంచకప్ అరంగేట్రంలోనే డకౌట్) సమం చేశాడు. ఇలాంటి ఒత్తిడిలో సూర్య 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య మినహా మరే బ్యాటర్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోవడం గమనార్హం.

భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో ఆడనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అమెరికాను ఓడించిన భారత్, ఆ తర్వాత పాకిస్థాన్ (కొలంబోలో), నెదర్లాండ్స్ (అహ్మదాబాద్‌లో) జట్లతో తలపడాల్సి ఉంది. పవర్‌ప్లేలో బ్యాటర్లు తడబడుతున్నా, మిడిల్ ఆర్డర్‌లో సూర్య ఫామ్, బౌలింగ్‌లో సిరాజ్, అర్ష్‌దీప్ కట్టుదిట్టమైన ప్రదర్శన భారత్‌కు కలిసొచ్చే అంశాలు. జస్ప్రీత్ బుమ్రా త్వరగా కోలుకుంటే జట్టు మరింత బలోపేతం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *