రోజు రోజుకు పెరిగి పోతున్న ప్లాస్టిక్ వినియోగం ఆందోళన కలిగిస్తోంది. దీని వలన కలిగే అనర్థాలు , భవిష్యత్ తరాలపై దుష్ప్రభావం కలిగించే అవకాశం ఉంది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది. ఈ విషయం తెలిసినా ప్రజలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రజల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చాడు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను తను ధరించిన బట్టలపై రాసుకొని ప్రచారం చేశాడు.
వివరాళ్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడుకు చెందిన తిప్పర్తి శివ అనే వ్యక్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం ప్రపంచ ప్లాస్టిక్ సంచుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అనుకున్నాడు. అందుకు ఓ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. తాను ధరించిన దుస్తులపై ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలను రాసుకొని, ఫ్లకార్డ్స్ చేతపట్టుకొని ప్రచారం చేశాడు. వీధి వీధికి తిరుగుతూ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాడు.
వినూత్న ప్రచారానికి సంబంధించిన వీడియో చూడండి..
దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వినియోగించవద్దని కోరుతూ.. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్‌ను పారదోలి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు నిచ్చాడు. అదేవిధంగా పాఠశాలలకు వెళ్లి ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాడు. ఆయన చేస్తున్న ప్రచారాన్ని చూసిన గ్రామస్తులు, ఉపాధ్యాయ ఉద్యోగులు అభినందించారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్‌ను నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రచారం చేసి ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.