Headlines

Watch: జంట పక్షిని రక్షించుకునేందుకు హంస ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Watch: జంట పక్షిని రక్షించుకునేందుకు హంస ఆరాటం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో


జంట పక్షులను చూసి ప్రేమికులు తమ ప్రేమ కూడా అలా ఉండాలని భావిస్తారు. అంటే మనుషులనే ఇన్‌స్పైర్‌ చేసేంత ప్రేమ భావం పక్షుల్లో ఉంటుందని మనకు అర్ధమవుతోంది. పక్షుల మధ్య ప్రేమ బోయవాడిని కవిగా మార్చింది. అది అద్భుత కావ్య రచనకు బాటలు వేసింది. తత్ఫలితంగా ప్రేమ, మానవ సంబంధ బాంధవ్యాల విలువలు తెలిపే రామాయణ మహాకావ్యం వెలువడింది. దీనిని రుజువు చేస్తూ మరోసారి జంట పక్షుల ప్రేమ చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తన జంటను కోల్పోయిన ఓ హంస తనను బ్రతికించుకునేందుకు పడిన తపన కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓ చెరువులో హంసల జంటలో ప్రమాదవశాత్తు ఒకటి ప్రాణాలు విడిచి నీటిపై చలనం లేకుండా తేలియాడుతోంది. ఇది గమనించిన దాని తోడు హంస, తన జంటను వదిలి వెళ్లలేకపోయింది. తన నేస్తం చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పక్షి, దాన్ని తిరిగి బతికించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన ముక్కుతో నెడుతూ, రెక్కలతో కదుపుతూ మేలుకొలిపేందుకు చేసిన విఫలయత్నం అక్కడున్న వారిని కలచివేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మరణం కూడా విడదీయలేని ప్రేమ. ఈ హంస తన ప్రాణం లేని భాగస్వామిని మేలుకొలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. హంసలు జీవితాంతం ఒకే జంటతో కలిసి జీవిస్తాయని, వాటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని పక్షి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తమ జంటలో ఒకటి దూరమైతే, రెండోది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. కొన్ని బంధాలు శాశ్వతంగా ఉంటాయి” అని నందా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా చలించిపోతున్నారు. “ఇదే కదా నిజమైన ప్రేమంటే” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన జంతువులకు కూడా మనుషుల్లాగే ప్రేమ, బాధ వంటి భావోద్వేగాలు ఉంటాయనే చర్చకు మరోసారి దారితీసింది. ప్రాణం లేని తన జంటను వదిలి వెళ్లలేక హంస పడుతున్న వేదన, నెటిజన్ల హృదయాలను ద్రవింపజేస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *