ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ శిథిలాల నుంచి ముగ్గురు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. మానసా దేవి కొండలోని ఒక భాగం నుండి శిథిలాలు విరిగిపడి రద్దీగా ఉండే హర్ కీ పౌరి-భీమ్ గోడా రహదారిపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న వారి మీద రాళ్లు పడగా, బైక్ కాస్త స్కిడ్ అయ్యింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని లాగి రక్షించాడు. జరిగిన ప్రమాదం సమీపంలోని దుకాణదారులు, స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. కాగా, ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సంఘటన భీమ్‌గోడా రైల్వే సొరంగం, కాళీ మాత ఆలయం సమీపంలో జరిగింది. మంగళవారం వాతావరణం దారుణంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం రద్దీగా ఉండింది. వాహనదారులు, పిల్లలు సహా అనేక మంది పాదచారులు పెను విపత్తు నుండి కొన్ని సెకన్లలో తప్పించుకోగలిగారు. వారు ఏ మాత్రం అప్రమత్తంగా ఉండకపోయినా కూడా ఫలితం విషాదకరంగా ఉండేదని, గణనీయమైన ప్రాణనష్టం తృటిలో తప్పిందని స్థానికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ వారం హరిద్వార్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఎక్కడికక్కడ వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో పాటు గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఘాట్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీరాల చుట్టుపక్కల ప్రజల్ని అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. వేగంగా ప్రవహించే నదులు, నీటి వద్దకు ప్రజలను కోరుతూ పోలీసులు కొత్త హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి…
Uttarakhand: Three youths on a bike narrowly escaped disaster as landslide debris fell over them in Haridwar. #Uttarakhand #UttarakhandNews pic.twitter.com/4gMHwbG25i
— Siddharth (@Siddharth_00001) August 6, 2025
అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వర్ష బీభత్సం హరిద్వార్ దాటి విస్తరించింది. ఉత్తరకాశిలో ధరాలి గ్రామం సమీపంలో భారీ వర్షపాతం నమోదైంది. ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనివల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం, ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళంతో సహా సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో 130 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్ జల ప్రళయానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..