హైదరాబాద్, జులై 2: జీడిమెట్లలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ చెరువు దగ్గర బుధవారం (జులై 2) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కట్టమైసమ్మ చెరువు మూల మలపులో ఓ కారు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లింది. కట్ట మైసమ్మ చెరువు కట్లలొకి దూసుకెళ్ఞిన కారు బురదలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..
బహుదూర్ పల్లి నుంచి సూరారం వైపు వస్తున్న కారు అతి వేగంతో చెరువులోకి దూసుకెళ్లింది. ఇన్నోవా కారు (TS08JS6336) చెరువు ప్రక్కన బతుకమ్మ పాండ్‌కు వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన తెల్లవారు జామున మద్యం మత్తులో జరిగినట్లు తెలుస్తుంది. కారులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. చెరువు గట్టు ప్రక్కన బురదలోకి వెళ్లి కూరుకుపోవడంతో డ్రైవరు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఎవ్వరికీ ఎలాంటి అపాయం జరగలేదు. సమాచారం అందుకొన్న పోలీసులు క్రైన్ సహకారంతో కారును బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొన్నట్లు సూరారం పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.