చేస్తున్న ఉద్యోగానికి సమయానికి రమ్మని బాస్ చెప్తే ఏం చేస్తాం..? ఇంకోసారి ఏ తప్పూ జరగకుండా జాగ్రత్త పడతాం. ఉద్యోగం దాని ద్వారా వచ్చే జీతం మనకు ముఖ్యం కాబట్టి చెప్పినట్లుగా వింటాం. అది తప్పదు కూడా. అలా కాదని ఎప్పుడైనా బాస్‌కే ఎదురుతిరిగారా.. పోనీ అలా ఎప్పుడైనా అనిపించిందా?.. అలా జరిగిందే అనుకోండి.. ఇంకేముంది, ఎంచక్కా ఉద్యోగానికి టాటా చెప్పి ఇంకో దగ్గర పని చూసుకోమంటారు ఎవరైనా. కానీ, ఇక్కడ ఓ మహిళా ఉద్యోగిని ఇలా చెప్పినందుకే వీరంగం సృష్టించింది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నీచర్.. ఇలా ఒక్కటేమిటి.. చేతికి దొరికిందల్లా ధ్వంసం చేసింది. విచిత్రంగా తోస్తున్న ఈ ఘటన మరెక్కడో జరిగిందేమో అనుకుంటున్నారా..? మన దేశంలోనే ఒడిశా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడింది. ఉన్నట్లుండి నియంత్రణ కోల్పోయి హోటల్ ఆస్తిని ధ్వంసం చేసింది. చేతికి అందినవన్నీ కింద పడేసి ఇష్టారీతిన వ్యవహరించింది. ఐరన్ రాడ్‌తో పూల కుండీలు, కంప్యూటర్లు, గాజు అల్మారాలు సహా ఆఫీసులోని అనేక వస్తువులను పగలగొట్టింది. ఊహించని ఆ మహిళ ప్రవర్తనకు హోటల్ సిబ్బంది, అతిథులు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ వీడియోలో రికార్డయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మహిళా ఉద్యోగిని గత కొన్ని రోజులుగా చేస్తున్న ఉద్యోగంలో సరైన విధంగా బాధ్యతలు నిర్వహించడం లేదు. పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు హోటల్‌కు వచ్చే కస్టమర్లతో కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆమెను హోటల్ మేనేజర్ పలుమార్లు హెచ్చరించాడు. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని చెప్పాడు.. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఆ మహిళా ఉద్యోగిని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. పైగా తన వల్ల హోటల్ నిర్వహణకు, హోటల్‌కు వచ్చే కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో యాజమాన్యం చర్యలు తీసుకుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆమెకు రాజీనామా నోటీసులు అందించడం జరిగింది. తనకే ఇలా నోటీసు ఇస్తారా అనే కారణంతో కోపంతో రగిలిపోతూ ఆ మహిళా ఉద్యోగిని హోటల్‌లోనే విధ్వంసానికి పాల్పడింది.
ఇది ఇంతటితో ఆగకుండా.. ఆమె తనను తొలిగిస్తే హోటల్‌నే మూసివేయిస్తానని మేనేజ్‌మెంట్‌ను బెదిరించినట్టు సమాచారం. ఈ ఘటన జరుగుతున్న సమయంలో హోటల్‌లో కస్టమర్లు ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో యాజమాన్యం ఇన్ఫోసిటీ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఇన్ఫోసిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ మహిళను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వాంగ్మూలం కోసం ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ పూర్తయితే హోటల్ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను ఆ మహిళా ఉద్యోగినిపై తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి పోలీసులు హోటల్ పరిసరాల్లో భద్రతను పెంచారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి