లక్నో, ఆగస్టు 4: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్‌రాజ్ నగరాలు నీట మునిగాయి. ఆ రెండు నగరాల్లో ఇళ్లలోకి నీళ్లు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా బాహుబలి మువీలో శివగామి దేవి (రాజమాత) నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన రెండు చేతులతో పైకి లేపి కాపాడటానికి ప్రయత్నించిన దృశ్యం సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటా బఘాడా ప్రాంతంలో వెలుగు చూసింది.
భుజాల వరకు వరద నీరు చేరడంతో ఓ జంట అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆస్పత్రికి తరలించడానికి నానాఅవస్థలు పడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శిశువు తండ్రి రెండు చేతులతో బిడ్డను పైకి ఎత్తి కాపాడటానికి ప్రయత్నించాడు (శివగామి పిల్లవాడిని కాపాడిన విధంగానే). ఇక అతడి వీపువెనుక భార్యను కూడా మోస్తున్నాడు. ఎదురుగా మరో వ్యక్తి వచ్చి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ముందుకు నడచి వెళ్లగా.. వెనుక బిడ్డ తండ్రి, తల్లి పీకల్లోతు వరద నీటిలో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుగు సాగారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నిస్సహాయుడైన తండ్రి తన బిడ్డను తన చేతులతో తలపైకి ఎత్తుకుని నీటిలో నడుస్తున్నాడు. తమ బిడ్డ అనారోగ్యం గురించి అధికారులకు తెలిపినప్పటికీ ప్రభుత్వం, పరిపాలన యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో, తండ్రి చివరకు బిడ్డను ఇలా చేతులపై మోసుకుని, తన భార్యను భుజంపై వేసుకుని వరద నీటిని దాటవలసి వచ్చింది.
ఇవి కూడా చదవండి
ये न्यू इंडिया है।
ये धार्मिक नगरी प्रयागराज है।
यहाँ मासूम बच्चे को माँ-बाप नाले से लेकर जाते हैं। pic.twitter.com/MX2QJTykSN— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 3, 2025
కాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం మొత్తం నగరాన్ని ముంచెత్తింది. ప్రతిచోటా నీరు నిలిచిపోయి సముద్రాన్ని తలపించింది. దాదాపు 15-16 లక్షల జనాభా వరదల గుప్పిట్లో చిక్కుకున్నారు. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది. నగరం నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రయాగ్‌రాజ్ అభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన యోగి సర్కార్ చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.