
జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, అన్ని ఏసీ బోగీల టికెట్ ధరలు పెరిగాయి. అయితే, సబర్బన్ ప్రయాణాలు, సీజన్ టికెట్లు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలలో మాత్రం మార్పు లేదు.
రైల్వే శాఖ కొత్తగా ప్రకటించిన సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్ల ధరలు..
500 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు సాధారణ ఛార్జీలు వర్తింపు.
501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.5 పెంపు..
1501 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.10 పెంపు..
2501 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.15 పెంపు..
ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ టికెట్ల ధరలు కిలోమీటరుకు అర పైసా చొప్పున పెంపు..
నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంపు..
అన్ని రకాల రైళ్లలో ఏసీ కోచ్‌ల టికెట్ ధరలు..
సాధారణ రైళ్ల నుంచి వందే భారత్ రైళ్ల వరకు అన్ని రకాల ఏసీ కోచ్ రైళ్లలో టికెట్ ధరలు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరిగాయి… ఇందులో చైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2-టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ కోచ్ వంటి అన్ని ఏసీ తరగతులు ఉంటాయి…పెంచిన ఈ రైల్వే టికెట్ ఛార్జీలు వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్ సఫర్, అమృత్ భారత్, గతిమాన్, మహామన, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ, ఏసీ విస్టాడోమ్ కోచ్‌లు వంటి అన్ని ప్రీమియం, స్పెషల్ సర్వీసులకు వర్తించనున్నాయి..
విజయవాడలో పెరిగిన రైలు ఛార్జీల ధరలు..
విజయవాడ డివిజన్‌లో పెరిగిన కొత్త రైలు చార్జీలు ధరలు అమలులోకి వచ్చాయి. దాదాపు 5 రూపాయల నుంచి 40 రూపాయల వరకు రైలు టికెట్ ధరలు పెరిగాయి. దూర రాష్ట్రాలైన మహారాష్ట్ర, జైపూర్, పశ్చిమ బెంగాల్ వెళ్లే స్లీపర్ క్లాస్ రైళ్లలో పది రూపాయల ధర పెరిగింది. స్లీపర్ క్లాస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 5 రూపాయలు.. థర్డ్ ఏసీలో కనిష్టంగా ఐదు రూపాయలు, గరిష్టంగా పాతిక రూపాయలు పెరిగాయి. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిత్యం రెండు వందలకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి తిరుగుతుండేవి లోకల్‌గా తిరిగే రైళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక డివిజన్ పరిధిలోనే తిరిగే రైళ్లు దాదాపు 25 పైనే ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా నిత్యం రెండు లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. వీరందరిపై ఇప్పుడు పెరిగిన ధరల భారం పడనుంది. అయితే ఈ పెరిగిన ధరల్లో మాత్రం ప్రాంతీయ రైళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పరిధిలో నడిచే రైళ్లల్లో ధరలు పెద్దగా పెరగలేదు. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, గుడివాడ, భీమవరం, నరసాపూర్, విజయనగరం, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు పెద్దగా ధరలు పెరగలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.