ఆదివారం గచ్చిబౌలిలోని వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమిసియన్స్ ఆధ్వర్యంలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న త్రివిధ దళాలకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ రంగంలో ఆపరేషన్ సింధూర్‌తో మన ఆర్మీ కొత్త చరిత్రను లిఖించిందని ఆయన అన్నారు. అంతేకాకుండా శత్రుదేశమైన పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టి మన పౌరుషాన్ని చాటిచెప్పిందని ఆయన తెలిపారు. ఇండియాలో మళ్ళీ టెర్రరిస్ట్ చర్యలు ఉంటే.. అది యుద్ధంగానే పరిగణిస్తామని భారత్ పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిందని వివరించారు.
తమ భూభాగంలోకి వచ్చే ధైర్యం ఎవరికి లేదని పాకిస్థాన్ ఇన్నాళ్లు అనుకునేది.. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోపలికి చొచ్చుకు వెళ్లి.. వాళ్ల ఎయిర్‌బెస్‌లను నాశనం చేసిందని ఆయన అన్నారు. మన సైనికులు, డిఫెన్స్ శాస్త్రవేత్తల వల్లే ఆపరేషన్ సింధూర్ సాధ్యం అయ్యిందని వెంకయ్యనాయుడు తెలిపారు. కేవలం మూడు దేశాలను తప్ప.. ప్రపంచంలోని అన్ని దేశాలను టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ ఏకం చేసిందని ఆయన అన్నారు.
ఇండియా ఎకానమీ పడిపోతుందని కొందరు అంటున్నారు. మన దేశ ఎకానమి పెరుగుతుందని వాళ్లకూ తెలిసినప్పటికీ ఎదో మాట్లాడాలని ఇలా అంటున్నారు. వాళ్లకు కూడా త్వరలోనే అర్ధం అవుతుంది మనం ఎక్కడున్నామో అని ఆయన అన్నారు. త్వరలోనే భారత్ వరల్డ్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వాడుకొని లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.