Vara lakshmi vratam: వరలక్ష్మి వ్రత పూజా విధానం మీ కోసం.. ముత్తైదువుకి వాయినం ఇలా ఇవ్వండి.. మీ కొంగు బంగారమే..

Vara lakshmi vratam: వరలక్ష్మి వ్రత పూజా విధానం మీ కోసం.. ముత్తైదువుకి వాయినం ఇలా ఇవ్వండి.. మీ కొంగు బంగారమే..


శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది ఆగస్ట్ 8న ఆచరించనున్నారు. ఈ రోజు వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుందని నమ్మకం. అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని.. మహిమని స్వయంగా శివుడు తన అర్ధాంగి పార్వతీదేవి కి వివరించినట్లు స్కంద పురాణం చెబుతోంది. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు. అంతేకాదు శ్రీ మహా విష్ణువు జన్మించిన నక్షత్రం శ్రవణా నక్షత్రం. అటువంటి పవిత్రమైన ఈ నెలలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్మకం. వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే..

వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి

పసుపు

కుంకుమ

ఇవి కూడా చదవండి

గంధం

పువ్వులు

గంధం లేదా చందనం

అక్షతలు

అరటి పండ్లు

తమలపాకులు

మామిడి ఆకులు

వక్కలు

కొబ్బరి కాయలు

ఎరుపు రంగు రవిక వస్త్రం

గాజులు

తెల్లని దారం

దీపం కుందులు

హారతి పళ్ళెం

నెయ్యి

కర్పూరం

అగర వత్తులు

పసుపు కొమ్ములు

బియ్యం

నాన బెట్టిన శనగలు

చిల్లర నాణేలు

పీట

వరలక్ష్మి వ్రత పూజా విధానం:

తెల్లవారుజామునే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసి, గంగాజలంతో ప్రోక్షణం చేయాలి. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ, చందనం పెట్టాలి. ఇంట్లోని పూజా మందిరంలో పద్మం రంగ వల్లుని వేసుకుని పూజా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి పూజ కోసం పీట వేసి బియ్యం పిండితో ముగ్గు వేసి.. దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరచుకోవాలి. తర్వాత అమ్మవారి కలశ స్థాపన చేయాలి. కలశం మీద కొబ్బరి కాయ పెట్టి.. అమ్మవారి స్వరూపంగా భావించి జాకెట్ ని మలిచి కొబ్బరి కాయ మీద పెట్టి నగలు, పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. పూజ కోసం పసుపు గణపతిని చేరుకొని తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకోవాలి.

శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ పుజని మొదలు పెట్టి తర్వాత దీపాలను నెయ్యి వేసి వెలిగించాలి.

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే అంటూ శ్లోకం పఠిస్తూ పూజ చేయాలి.

కలశ పూజ చేస్తూ వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి.

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ అమ్మవారిని తలచుకుని పూజ మొదలు పెట్టాలి.

వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేసుకుంటూ షోడపోశపచార పూజ అథాంగ పూజ చేయాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించాలి.

తోరగ్రంథి పూజ

తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి తోరాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత తోరగ్రంథి పూజ చేసుకోవాలి. ఆ కంకణాన్ని కుడిచేతికి ధరించాలి.

వరలక్ష్మి వ్రత కథ

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

వ్రత కథ ముగిసిన అనంతరం అమ్మవారి కోసం చేసిన పిండి వంటలు, పాయసం, పరమాన్నం, చలిమిడి, వడపప్పు, పండ్లు వంటి వాటిని నైవేద్యాలని నివేదించి తాంబూలాలని సమర్పించి, కర్పూర నీరాజనం ఇవ్వాలి. మంత్రపుష్పం చదివి.. చివరిగా మంగళహారతి ఇవ్వాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి అనుకుంటూ ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి.

ముత్తైదువకు వాయినం

వ్రతం చివరగా ముత్తైదువుకు వాయానాన్ని ఇవ్వాలి. ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పువ్వులు, నానాబెట్టిన శనగలను వాయనం ఇచ్చి ఆమె నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం కథ విన్నా, చదివినా మహిళా సౌభాగ్యంతో జీవిస్తుందని.. సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపద వృద్ధి కలుగుతాయని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *