Vaibhav Suryavanshi : వైభవ్ ఇంకా స్టార్ కాలేదు..ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..తండ్రి సంచలన వ్యాఖ్యలు

Vaibhav Suryavanshi : వైభవ్ ఇంకా స్టార్ కాలేదు..ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..తండ్రి సంచలన వ్యాఖ్యలు


Vaibhav Suryavanshi : అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులతో వీరవిహారం చేసిన ఈ బిహారీ కుర్రాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, ప్రపంచం మొత్తం అతడిని ఆకాశానికెత్తుతున్నా.. అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాత్రం చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారు. తన కొడుకు సాధించింది ఇంకా ఏమీ లేదని, అసలైన ఆట ముందుందని ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయసులోనే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 55 బంతుల్లోనే సెంచరీ బాది, మొత్తం 175 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా నిలిచాడు. ఇంతటి ఘనత సాధించినా తన కుమారుడిని ‘బిగ్ స్టార్’ అని పిలవడానికి ఆయన తండ్రి నిరాకరిస్తున్నారు. “ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. వైభవ్ టీమిండియా తరఫున వైట్ జెర్సీ వేసుకుని టెస్టు క్రికెట్ ఆడే వరకు అతడిని నేను స్టార్ క్రికెటర్‌గా గుర్తించను” అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడితే సరిపోదని, అసలైన నైపుణ్యం టెస్టుల్లోనే బయటపడుతుందని ఆయన నమ్ముతున్నారు.

కుమారుడికి కేవలం క్రికెట్ మెళకువలే కాదు, క్రమశిక్షణను కూడా ఆయన నూరిపోస్తున్నారు. “నువ్వు ఎన్ని పరుగులు చేసినా సరే, ఒదిగి ఉండటం నేర్చుకోవాలని నా కొడుక్కి ఎప్పుడూ చెబుతుంటాను. సచిన్ టెండూల్కర్‌ను చూసి క్రికెట్ అంటే ఏంటో నేర్చుకోమంటాను. ఆయన కెరీర్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా, ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. వైభవ్ కూడా అలా హుందాగా ఉండాలని నా కోరిక” అని ఆయన ఆకాంక్షించారు. సీనియర్లను గౌరవించడం, లోపాలను సరిదిద్దుకోవడం ద్వారానే గొప్ప క్రికెటర్ కావచ్చని తండ్రిగా ఆయన మార్గనిర్దేశం చేస్తున్నారు.

అండర్-19 వరల్డ్ కప్ 2026లో వైభవ్ ప్రదర్శన ఒక అద్భుతం. ఏడు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ బాదాడు. ముఖ్యంగా ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో 175 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఐపీఎల్ వేలంలోనూ ఈ పిల్లాడు అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అయితే తండ్రి ఆలోచనలు మాత్రం ఐపీఎల్ కోట్లు లేదా వన్డేల మీద లేవు.. ఆయన కళ్లన్నీ తన కుమారుడు భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించే ఆ రోజు కోసమే వేచి చూస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *