మహిళలకు తరచుగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTIలు), ఈస్ట్ ఇన్ఫెక్షన్లు. ఈ రెండింటి లక్షణాలు కొన్నిసార్లు ఒకేలా అనిపించినా.. అవి వేర్వేరు కారణాల వల్ల వస్తాయి. వాటికి చికిత్స కూడా వేరుగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుంటే సమస్యను త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి..?
బ్యాక్టీరియా మూత్ర మార్గంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమైనప్పుడు దీన్ని UTI అంటారు. ఇది ఎక్కువగా మూత్రాశయం, మూత్రనాళం లేదా ఒక్కోసారి కిడ్నీలను కూడా ప్రభావితం చేయవచ్చు.
లక్షణాలు
- తరచుగా మూత్రం పోవాలని అనిపించడం.
- మూత్రానికి వెళ్లేటప్పుడు మంట లేదా నొప్పి.
- మూత్రం రంగు మసకబారడం, దుర్వాసన రావడం.
- పొత్తికడుపులో నొప్పి.
- కొన్ని సందర్భాల్లో జ్వరం, వెన్ను నొప్పి కూడా రావచ్చు. ఇవి ఇన్ఫెక్షన్ కిడ్నీలకు చేరిందని సూచిస్తాయి.
- ఈ పై ఇన్ఫెక్షన్‌కు డాక్టర్లు సాధారణంగా యాంటీబయాటిక్స్ ఇస్తారు.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి..?
క్యాండిడా అనే ఒక రకమైన ఫంగస్ ఎక్కువగా పెరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఎక్కువగా వజైనా భాగంలో కనిపిస్తుంది. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే UTIతో పోలిస్తే పూర్తిగా వేరు.
లక్షణాలు
- తీవ్రమైన దురద.
- వైట్ డిశ్చార్జ్ (Leukorrhea)
- వజైనా ప్రాంతంలో ఎరుపు రంగు, వాపు.
- మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి.
- ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్లు లేదా క్రీములను సూచిస్తారు.
రెండింటి మధ్య ముఖ్యమైన తేడాలు
- ఈ రెండు ఇన్ఫెక్షన్ల లోనూ యూరిన్ కి వెళ్లేటప్పుడు ఇబ్బందిగా అనిపించవచ్చు.
- UTIలో ముఖ్యంగా యూరిన్‌లో మంట, నొప్పి, పదే పదే యూరిన్ కి వెళ్ళాలనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.
- ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లో ముఖ్యంగా వజైనా ప్రాంతంలో వాపు, వైట్ డిశ్చార్జ్, దురద ఉంటాయి.
మీకు ఈ రెండింటిలో ఏ ఇన్ఫెక్షన్ పై అయినా అనుమానం ఉంటే.. సొంతంగా మందులు వాడకుండా డాక్టర్ ను కలవడం చాలా ముఖ్యం. యూరిన్ టెస్ట్ ద్వారా UTIని, వజైనా స్వాబ్ టెస్ట్ ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను ఈజీగా కనిపెట్టవచ్చు. లక్షణాలు ఒకేలా కనిపించినా, వాటి కారణాలు, ట్రీట్‌మెంట్ పూర్తిగా వేరుగా ఉంటాయి. కరెక్ట్ ట్రీట్‌మెంట్ కోసం డాక్టర్ సలహా తీసుకోవడమే బెస్ట్.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)