ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయ పరిసరాల్లోని కుశావర్త్ కుండం అనే పేరుతో పిలవబడే ఈ కోనేరు 167 సంవత్సరాల్లో తొలిసారిగా పూర్తిగా ఎండిపోయింది. ఇది ఒక పవిత్ర స్నాన స్థలంగా పరిగణించబడుతోంది. ఇక్కడ తీర్థ యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే.. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నీటి కొరత కారణంగా ఈ కుండం పూర్తిగా ఎండిపోయింది. దీన్ని తిరిగి నీటితో నింపేందుకు నాశిక్ మున్సిపల్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నది ఒడ్డున ఉన్న నంది ఘాట్ నుంచి నీటిని తీసుకొచ్చి కుండం లోకి నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రావణ మాసం కనుక భక్తుల తాకిడి మరింత పెరగింది. శ్రావణ మాసంలో త్రయంబకేశ్వర దేవస్థానంలో పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. కుంభమేళా సమయంలో కూడా ఈ ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన త్రయంబకేశ్వర ఆలయంలో కుండం ఎండిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మేరకు ఆలయ అధికారులు, నాసిక్ మున్సిపల్ కౌన్సిల్ నేతృత్వంలో కుండం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అయితే.. ఇక్కడే మరో చిక్కు వచ్చి పడింది. ఏళ్లుగా భక్తితో కొలుస్తూ పుణ్య స్నానాలకు నిలయమైన కుశావర్త్ కుండం ఎండిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని పునరుద్ధరణ పనులు చేపట్టడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ మతపరమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశం అని భక్తులు అంటున్నారు. కుండం నిర్వహణను గాలికొదిలేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరణ పనులు చేపట్టి నీటిని నింపడం అనేది తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు పనులు జరుగుతుండగానే.. మరోవైపు కుండం నిర్వహణ, వ్యయ భారం వంటి అంశాలపై ఇంకా చర్చ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..