వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువుల అమరిక గురించి తెలియజేసే శాస్త్రం. ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువులు ఎక్కడ, ఏ దిశలో ఉండాలనేదానిపై సూచనలు చేస్తుంది. ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి? ఏ వస్తువులు ఉండదు.. ఏ వస్తువుల వల్ల శుభాలు, అశుభాలు కలుగుతాయనేది తెలియజేస్తుంది. ఇక, వాస్తు శాస్త్రంలో తాబేలుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం తాబేలు శుభప్రదమైనదిగా, పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచితే ఆనందం, శ్రేయస్సు, సంపద, శాంతి కలుగుతాయని విశ్వాసం ఉంది. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో కూర్మ అవతారం ఎత్తి, క్షీరసాగర మథన సమయంలో మందరాచల పర్వతాన్ని తన వీపుపై మోసాడని చెబుతారు. అందువల్ల తాబేలుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో తాబేలు బొమ్మ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ఆర్థికాభివృద్ధి
తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచితే సంపద, అదృష్టం ఆకర్షితమవుతాయని నమ్మకం. ముఖ్యంగా క్రిస్టల్ లేదా లోహంతో తయారు చేసిన తాబేలు బొమ్మను ఉంచడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఇది ఆర్థిక స్థితి మెరుగుపడటానికి దోహదపడుతుందని విశ్వసిస్తారు.
ఆరోగ్యం, దీర్ఘాయువు
తాబేలు దీర్ఘాయుష్షుకు చిహ్నంగా భావించబడుతుంది. ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుందని, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని పూర్వీకుల నమ్మకం.
శాంతి, శ్రేయస్సు
తాబేలు ప్రశాంతతకు ప్రతీక. ఇంట్లో దీని బొమ్మ ఉంటే ఆ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండి, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుందని చెబుతారు. అలాగే ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని భావిస్తారు.
తాబేలు బొమ్మను ఎక్కడ ఉంచాలి?
తాబేలు సాధారణంగా ప్రశాంతంగా జీవించే జీవి. అందువల్ల పూజా గదిలో నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో తాబేలు బొమ్మను ఉంచడం ఉత్తమమని అంటారు. సాధారణంగా ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదంగా భావించబడుతుంది. ప్రతిరోజూ తాబేలు బొమ్మపై తులసి దళం ఉంచడం కూడా మంచిదని చెబుతారు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు తాబేలు బొమ్మను దర్శిస్తే పని విజయవంతమవుతుందని నమ్మకం ఉంది.
లోహపు తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచితే పిల్లల చదువులో ఏకాగ్రత పెరిగి, మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని విశ్వాసం. కార్యాలయం లేదా దుకాణంలో తాబేలు బొమ్మను ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి కలిగి, ధనలాభం జరుగుతుందని అంటారు. అలాగే చెక్కతో చేసిన తాబేలు బొమ్మను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచితే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, కుటుంబ బంధాలు మరింత బలపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)