ఒక సినిమా ముందు డైరెక్టర్ మదిలో పుట్టి.. కథగా మారి.. హీరో చెవిన పడ్డాక.. దానికి రూపం రావడం ప్రారంభమవుతుంది. నిర్మాత డబ్బులు ఇన్వెస్ట్ చేయడం.. తారాగణం సెట్ అయ్యాక.. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వందల మంది జూనియర్ ఆర్టిస్టులతోపాటు.. ఎంతోమంది కార్మికులు పనిచేస్తారు. పై లేయర్ కాకుండా.. ఈ కిందలేయర్లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు, కార్మికులకు షూటింగ్స్ ఉంటేనే పూటగడుస్తుంది. వారు లేకపోతే.. షూటింగ్ ఇంచ్ కూడా కదలదు. ప్రొడక్షన్ ముందుకు సాగదు. వారు సరైన పనిచేయకపోతే సినిమానే సరిగా నడవదు. అలాంటి కార్మికులు ఇప్పుడు షూటింగులే బంద్ అంటూ పిలుపునిచ్చారు. షూటింగులు చేసేదే లేదంటూ తెగేసి చెప్పేశారు.
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.. తమకు 30శాతం వేతన పెంపు కావాలంటూ డిమాండ్ చేసింది. మొత్తం 24 క్రాఫ్ట్‌లకు చెందిన వారు ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. మార్చ్ నుంచి ఇప్పటివరకు 5 సార్లు ఫిల్మ్ చాంబర్‌కు నోటీసులు ఇచ్చింది కార్మికుల మండలి. తమకు వేతనాలు పెంచకుంటే షూటింగ్స్ బంద్ చేస్తామంటూ పిలుపునిచ్చింది. కాని నిర్మాతలు స్పందించలేదు. దీంతో ఆగస్ట్ 4 నుంచి షూటింగ్స్ మొత్తం ఆపేస్తున్నట్లు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయినా ఎవరూ నోరు మెదపకపోవడంతో షూటింగ్స్ ఆగిపోయాయి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 28000 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్లో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 24 క్రాఫ్టులకు చెందిన వారు ఉన్నారు. ఈ 28వేల మందిలో 4వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇస్తున్న వేతనాలకు 30శాతం అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు 2వేల నుంచి 5వేల వరకు.. మిగిలిన కార్మికులకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. వీటి అదనంగా 30శాతం అంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని నిర్మాతలు భయపడుతున్నారు. తమిళ, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమల్లో వీరికి చెల్లిస్తున్న దానికన్నా.. మనదగ్గరే ఎక్కువ ఇస్తున్నామంటున్నారు నిర్మాతలు. కనీసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వ్యత్యాసం ఉందంటున్నారు. ఇలాంటి సమయంలో వీరి డిమాండ్లు ఆచరణ సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు సాధారణ కార్మికులకు వచ్చే జీతం కన్నా.. చిత్రపరిశ్రమలో ఎక్కువే వస్తుందని కూడా అంటున్నారు. అలాంటపుడు వీరి డిమాండ్లు అర్ధరహితం అని నిర్మాతల వాదన. అయితే.. ఈ నిర్మాతలే.. హీరోల పారితోషికంలో ఇలా ఎందుకు మాట్లాడడం లేదన్నది కార్మికుల వాదన. ఐదేళ్ల క్రితం ఐదు కోట్లు తీసుకున్న హీరో.. ఇప్పుడు 50కోట్లు తీసుకుంటున్నాడని.. కొందరు వంద, రెండు వందల కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వారి పారితోషికాలు పది నుంచి వంద రెట్లు పెరిగాయిగాని.. తమకు చాలా తక్కువ ఇస్తున్నారని కార్మికులు అంటున్నారు.
సినిమా షూటింగ్స్ బంద్ అవడంతో.. వారి డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రీ రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. కార్మికులకు ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నామని అంతా డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారికి కూడా ఫిలిం చాంబర్ ఇదే విషయాన్ని చెప్పింది. వారికి ఎక్కువే ఇస్తున్నామంటూ నిర్మాతలు చెబుతున్నారు. చిన్న చిత్రాల వారు తక్కువ ఇవ్వొచ్చేమోగాని.. పెద్ద నిర్మాతలు కార్మికులకు భారీగా చెల్లిస్తున్నారని చెబుతున్నారు.
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బంద్పిలుపుతో.. చాలా షూటింగ్స్ సెట్స్‌పైనే ఆగిపోయాయి. ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగాల్సిఉంది. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ ల మూవీ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్, అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో సాంగ్ జరగాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టుకున్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా.. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగాల్సి ఉంది. నాగచైతన్య… కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం.. రామ్ పోతినేని, పి. మహేష్ బాబు డైరెక్షన్లో జరగాల్సిన సినిమా.. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ.. సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా.. తేజ సజ్జా, సిద్దు జొన్నలగడ్డ, అఖిల్ అక్కినేని సినిమాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.