Telangana Rain Alert: ఉన్నట్టుండి మూడు రోజుల పాటు వర్షాలు.. అకాల వర్షంతో జాగ్రత్త!

Telangana Rain Alert: ఉన్నట్టుండి మూడు రోజుల పాటు వర్షాలు.. అకాల వర్షంతో జాగ్రత్త!


తెలంగాణలో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. శ్రీలంక సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని తెలిపారు. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చినుకులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 22న మధ్య, తూర్పు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపారు.

మరో వైపు రాష్ట్రం నుంచి తేమ గాలులు అల్పపీడన ప్రాంతం వైపు వీచడం వల్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 20) నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగానే ఉన్నాయి. భద్రాచలంలో 36.2 డిగ్రీలు, ఖమ్మంలో 35.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 35.8 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 35 నుంచి 42 శాతం మధ్య ఉంది. మెదక్ జిల్లాను తప్ప మిగతా ప్రాంతాల్లో వేడి తీవ్రంగా అనిపిస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఎండల ప్రభావం ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే కనిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ సమయంలో బయటకు వెళ్లేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు. మొత్తంగా ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *