తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది. సొంతింటి కల ప్రతీఒక్క సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది. దీనిని సాకారం చేసుకునేందుకు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. అయితే వీరి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో నగరాల్లో నివసించే సామాన్యులు తక్కువ ధరకే ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం కొత్త పాలసీని రూపొందించనుంది.
ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీ
త్వరలో ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఫిబ్రవరిలో నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని డెడ్ లైన్ విధించారు. ఈ పాలసీ రూపకల్పనలో పాలుపంచుకునేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ విధానంలో సీబీఆర్ఐ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఇక మార్చి నాటికి తుది పాలసీని సిద్దం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో ఈ పాలసీని ఆమోదించనున్నారు. అనంతరం పాలసీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చిలో కేబినెట్‌లో ఆమోదముద్ర వేసిన తర్వాత కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీపీపీ విధానంలో నగరాలు, పట్టణాల్లో ఇండ్లు నిర్మించి పేదలకు అందించనున్నారు. పట్టణాల్లో నివసించే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తక్కువ ధరకే ఇళ్లు అందజేత
మొత్తం మూడు విడతలుగా ఇళ్ల సముదాయాలను ప్రభుత్వం నిర్మించనుంది. ఇక హైదరాబాద్‌లో మురికివాడల్లో భవనాలను నిర్మించి ప్రజలకు ఇవ్వనున్నారు. ఇక టైర్ 2 పట్టణాల్లో కూడా ఇళ్ల టవర్లను నిర్మించి అందించనున్నారు. ఇప్పటికే ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో స్థలాలను గుర్తించింది. ఇక్కడ ఇళ్ల సముదాయాలను నిర్మించి తక్కువ ధరలకు లబ్దిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో ఇళ్లు కొనాలంటే కోట్లు, లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. మధ్యతరగతి ప్రజలు వీటిని కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి అతి తక్కువ ధరకే ప్రజలకు పంపిణీ చేస్తారు. దీని వల్ల సామాన్యుల సొంతింటి కల నెరవేరుతుంది. ఇందుకు అనుగుణంగా పాలసీ రూపొందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. త్వరలోనే పాలసీ గైడ్‌లైన్స్ జారీ కానున్నాయి.