మంచిర్యాల, ఆగస్ట్ 8: కృషి, సడలని పట్టుదల ఉంటే ఎంతటి విజయాలైన సాధించవచ్చని ఓ రైతు బిడ్డ నిరూపించింది. మంచిర్యాల జిల్లా వ్యవసాయ కుటుంబంకి చెందిన ఓ విద్యార్ధిని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గజ్‌నగర్ పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2022లో 12వ తరగతి చదివిన రవీన అనే విద్యార్ధిని మైక్రోసాఫ్ట్ సంస్థలో అధిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ మేరకు నవోదయ ప్రిన్సిపల్ రేపాల కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బదావత్ ప్రభాకర్, వనిత దంపతుల కుమార్తె రవీన. చిన్నతనం నుంచే చదువులో ఎంతో చురుకుగా ఉండే రవీన.. 6వ తరగతిలో నవోదయలో ప్రవేశం పొంది 12వ తరగతి వరకు అక్కడే చదివింది. అనంతరం 2022లో అలహాబాద్ ఐఐటీలో సీటు పొందింది. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రాంగణ నియామకంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో ఏడాదికి ఏకంగా రూ. 51 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికైంది. రవీన సాధించిన విజయం ఎందరికో ఆదర్శం.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు బదావత్ ప్రభాకర్, వనిత దంపతుల కుమార్తె రవీన. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రవీనా.. చదువులో ప్రతిభకనబరిచేది. ప్రస్తుతం ఐఐటీ అలహాబాద్‌లో చదువుకుంటున్న రవీనా.. ఈ విద్యా సంవత్సరానికి నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో పాల్గొన్న దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో అరకోటి రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. రవీన విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, సన్నిహితులు, తోటి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లోనూ ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో సీటు సంపాదించి, ఇప్పుడు దిగ్గజ సంస్థలో కొలువుకొట్టడంతో అందరూ రవీనాపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. ఎందరో యువతకు రవీన విజయగాథ తేలతెల్లం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.