మెగాస్టార్ నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్. ఈ సినిమా గుర్తుందిగా…? ఎంబీబీఎస్ పూర్తి కాకముందే మెళ్లో స్టెతస్కోపేసుకుని కత్తెర్లు-కటార్లు పట్టుకుని వైద్యం చేసే వెరైటీ క్యారెక్టర్ అది. కానీ.. ఎంబీబీఎస్ చదివి కూడా చేసే ఓవరాక్షన్ల గురించి ఎక్కడైనా విన్నారా? తెలంగాణలో డెంటిస్టుల సొసైటీ అటువంటి అభియోగాల్నే ఎదుర్కొంటోందిప్పుడు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఫేషియో ఆస్థటిక్ ప్రోజర్… లాంటి క్లిష్టమైన కాస్మొటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్‌లో వేలు పెడుతున్నారని సగటు డెంటిస్టుపై దాడి మొదలైంది. పళ్ల డాక్టర్లు పళ్లకు మాత్రమే చికిత్స చేయాలి.. ఎగస్ట్రాలు ఎందుకు చేస్తారు అని ఓపెన్‌గానే అభ్యంతరం తెలిపింది తెలంగాణ మెడికల్ కౌన్పిల్. అప్‌డేట్ అవడం.. టెక్నాలజీని అందిపుచ్చుకుని ట్రీట్మెంట్‌లో బెటర్‌మెంట్ కోసం ప్రయత్నించడం.. ఇదంతా ఓకే. కానీ.. ఏ విభాగంలో డిమాండ్ ఉంటే ఆ డిపార్ట్‌మెంట్ మీద వాలిపోయి.. పరకాయ ప్రవేశం చేస్తే ఎలా..? తగుదునమ్మా అంటూ కొంతమంది డెంటిస్టులు కాస్మొటిక్స్ చికిత్స చేయడాన్ని తప్పుపడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్పిల్.
కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత చికిత్స చేస్తారు. ఆర్థోపెడిక్ ఎముకల సంబంధిత సమస్యల్ని చూస్తారు.. కళ్లకొచ్చే వ్యాధుల కోసం ఆప్తమాలజిస్టులు… ఇలాగే చిన్నపిల్లలకు పీడియాట్రిస్ట్, గర్భవతులకు గైనకాలజిస్ట్, క్యాన్సర్ పేషెంట్లకు ఆంకాలజిస్ట్.. ఇలా ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. అత్యవసరమైతే తప్ప వాళ్ల పరిధిని దాటి పక్కకెళ్లొద్దని వాళ్ల కురిక్యులమ్‌లోనే రాసుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా అదే చెబుతుంది. కానీ.. డెంటిస్టులు మాత్రం ఇటీవలికాలంలో గీత దాటుతున్నారా..? వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని కాస్మొటిక్ సెక్టార్‌ని కబ్జా చేస్తున్నారు అనేది డెంటిస్టులపై వినిపిస్తున్న ఆరోపణ.
ఇవాళారేపూ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇంకేంటి సౌందర్య పోషణేగా? మొహంలో ముక్కూమూతీ ఏది ఏ వంకర పోయినా ఎన్ని లక్షలైనా ఖర్చుపెట్టి సరిచేయించుకోవడం ఒక వేలంవెర్రి. అందుకే.. కాస్మొటిక్ రంగం అత్యంత లాభసాటిగా మారింది. సహజసిద్ధంగా వచ్చిన రంగును, శరీర ఆకృతినీ మార్చుకోవడానికి అందరూ పోటీపడ్డంతో కాస్మటిక్ ట్రీట్‌మెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదనుగా సరైన రెగ్యులేషన్ లేని కాస్మొటాలజిస్టులంతా మార్కెట్లోకొచ్చేశారు. వీళ్ల ఆనాకారీ ట్రీట్‌మెంట్‌తో ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే డెంటిస్టుల సబ్జెక్ట్ తెరమీదికొచ్చింది. సరైన అవగాహన లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కాస్మొటిక్ సర్జరీలు చేస్తున్నారంటూ డెంటిస్టులపై విరుచుకుపడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. రిజిస్టర్డ్ ఎంబిబిఎస్ డాక్టర్లు వాళ్ల స్పెషలైజేషన్‌లో మాత్రమే చికిత్స చేయాలి. నేషనల్ మెడికల్ కమిషన్ రూల్‌బుక్‌లో ఈ విషయం స్పష్టంగా ఉందని వాదిస్తోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. కానీ… డెంటిస్టులు సైతం కాస్మొటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారనేది వాళ్ల ఆరోపణ. డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు తప్ప మరెవరూ కాస్మోటిక్ ట్రీట్మెంట్ చేయకూడదట.
డెంటల్ అసోసియేషన్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. డెంటల్ విద్యార్థులు పీజీ చేస్తున్న సమయంలో 8 విభాగాలకు శిక్షణ ఇస్తారు. వాటిలో ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జరీ OMFS ఒకటి. ఇందులో శిక్షణ పొందినవాళ్లు బేషుగ్గా కాస్మొటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చట. ఇండియన్ డెంటల్ కౌన్సిలే ఈ విషయాన్ని సర్టిఫై చేసింది. మధ్యలో మీరెవరు చెప్పడానికి అని ప్రశ్నిస్తోంది తెలంగాణ డెంటల్ అసోసియేషన్.
OMFSలో ఫేస్ లిఫ్ట్, బ్రౌలిఫ్ట్ , ఆసియన్ బ్లీఫరోప్లాస్టీ, ఓటోప్లాస్టీ, రైనోప్లాస్టీ, బుగ్గలు-గడ్డం సైజుల్ని పెంచే ఆగ్మెంటేషన్, మెడ భాగంలో చేసే లైపోసక్షన్, లేని వెంట్రుకల్ని మొలిపించే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పెదవుల అందాన్ని రెట్టింపు చేసే లిప్ ఎన్‌హాన్స్‌మెంట్… ఇంకా బోటాక్స్, ఫిల్లర్లు , ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా, కెమికల్ పీల్, మెసోథెరపీ.. ఇలా అనేక రకాల ట్రీట్‌మెంట్లు మా పరిధిలోకే వస్తాయ్ అంటోంది డెంటిస్ట్ సొసైటీ.
మెడికల్ కౌన్సిల్ మాత్రం ససేమిరా అంటోంది. డెంటిస్టులు ఎట్టిపరిస్థితుల్లోనూ కాస్మొటిక్ ట్రీట్మెంట్ చేయకూడదు.. అని NMC బేసిక్ గైడ్‌లైన్స్‌ని ప్రస్తావిస్తోంది. డెంటల్ కౌన్సిల్ మాకు ఎలాంటి కండిషన్లూ పెట్టలేదు.. ఎవరేమన్నా మేం కాస్మోటిక్ చికిత్స చేసే తీరతాం అని మొండికేస్తోంది డెంటిస్ట్ అసోసియేషన్. ఈ వివాదంపై కొన్ని సంఘాలు కోర్టు తలుపు కూడా తట్టేశాయి. మరి.. ఎప్పటికి తెగుతుందో తెలంగాణలో పళ్లడాక్టర్ల పితలాటకం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.