జగిత్యాల జిల్లా కోరుట్లలో సోషల్ మీడియా వైరల్ కావాలనే కోరిక ఒక యువకుడిని మారువేషం దాకా తీసుకెళ్లింది. బుర్ఖా ధరించి బస్టాండ్‌లో తిరిగిన యువకుడిని ఆర్టీసీ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం సమయంలో కోరుట్ల బస్టాండ్‌కు బుర్ఖా ధరించి ఓ వ్యక్తి వచ్చి మహిళ ప్రయాణికుల మధ్య కూర్చొని చిలిపి చేష్టలు అనుమానాలకు దారితీసింది. మొదట సాధారణ ప్రయాణికురాలిగా కనిపించినా, కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పక్కన కూర్చున్న మహిళలు గమనించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆర్టీసీ సిబ్బంది కొంతసేపు ఆమె చేష్టలను పరిశీలించిన తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా సమాధానాల్లో పొంతన లేకపోవడంతో స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ సమయంలో బుర్ఖా వేసుకున్నది మహిళ కాదని, యువకుడేనని తేలింది. మొదట స్నేహితుడి కోసం వేషం వేసుకున్నానని చెప్పిన అతడు, తరువాత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇలా చేశానని ఒప్పుకున్నాడు. సిబ్బంది మహిళల పక్కన కూర్చోవడానికా.. ఉచిత బస్సు ప్రయాణం కోసమా.. లేక దొంగతనాల కోసమా.. అని ప్రశ్నించగా వాటిలో ఏదీ కాదని తెలిపాడు. పోలీసులు బుర్కా వేసుకున్న వ్యక్తి వివరాలను సేకరించగా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన సుమన్‌గా గుర్తించారు. సుమన్ అతని స్నేహితుడు అఖిల్ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సుమన్ అనే యువకుడితో పాటు అతని స్నేహితుడు అఖిల్‌పై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొంతసేపు కలకలం నెలకొంది. మారువేషాల్లో తిరుగుతున్న వ్యక్తులు నిజంగా వినోదం కోసమేనా లేదా దురుద్దేశాల కోసమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ కావాలనే ఆశతో చేసే విన్యాసాలు చట్టపరమైన సమస్యలకు దారి తీస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా హైలైట్ కావాలనే తపన ఎంతదూరం తీసుకెళ్తుందో మరోసారి బయటపడింది. లైకులు, వ్యూస్ కోసం యువత అడ్డదారులు పడుతూ చిన్న వినోదం కోసం చేసిన పని కేసుగా మారిన ఘటనగా కోరుట్ల సంఘటన నిలిచింది.
Suman