Telangana: నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే

Telangana: నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే


ఒక రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్‌లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న ఖర్గే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రెండు టార్గె్ట్స్‌ ఇవ్వడంతో పాటు రెండు వార్నింగ్స్‌ కూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సూచన

ఖర్గే ఇచ్చిన రెండు టార్గెట్స్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించాల్సిందే అని ఖర్గే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నేతలదే అన్నారు. నేతలంతా కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ గెలుపు కష్టమేమీ కాదన్నారు.

నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఖర్గే

మరోవైపు టీపీసీసీ సమావేశంలో ఖర్గే వార్నింగ్స్‌ కూడా గట్టిగానే ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ఇచ్చిన పదవులను నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దని ఖర్గే తెలిపారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలన్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఖర్గే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు గ్రూప్‌లు కడితే భయపడతారని అనుకుంటున్నారని.. కానీ అది జరగదని తేల్చిచెప్పారు. పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను పట్టించుకోబోమన్నారు. కొండా మురళి, అనిరుధ్ రెడ్డి వంటి నేతలను ఉద్దేశించే ఖర్గే ఈ కామెంట్స్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామన్న రేవంత్

మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందన్నారు సీఎం రేవంత్. ఖర్గేతో పాటు కాంగ్రెస్ సామాజిక న్యాయభేరి సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసేందుకు హైదరాబాద్ పర్యటన చేపట్టిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సూచనలు, వార్నింగ్‌లను నాయకులు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *