
సూర్యాపేట జిల్లా మోతే మండలం విభలాపురంకు చెందిన వెంకన్న, లింగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. తన వాటా రెండు ఎకరాల భూమిని తనకు ఇవ్వాలంటూ పెద్ద కొడుకు గంగయ్య తండ్రితో గొడవ చేస్తున్నాడు. ఇదే క్రమంలో భార్య లింగమ్మ అనారోగ్యం బారిన పడడంతో వైద్య ఖర్చుల కోసం రెండు ఎకరాలను వెంకన్న అమ్మాడు. మిగిలిన రెండు ఎకరాల్లో అర ఎకరం కూతురుకి ఇచ్చాడు. దీంతో తండ్రి వెంకన్న, పెద్ద కొడుకు గంగయ్య మధ్య భూ వివాదం మరింత తీవ్రమైంది. గ్రామ పెద్దలు ఎన్నోసార్లు భూ వివాదంలో గంగయ్య కు సర్ది చెప్పారు. అయినా భూమి ఇవ్వడం లేదని తండ్రి వెంకన్న పై కొడుకు గంగయ్య కక్ష పెంచుకున్నాడు.
సూర్యాపేట నుండి వెంకన్న బైక్ పై విభలాపురంకు వెళ్తుండగా, మార్గమధ్యలో మాటు వేసిన కొడుకు గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకన్నను కుటుంబ సభ్యులు సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మోతే పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..