తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్‌ను అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఉచితంగా ఈ టీకాను అమ్మాయిలకు అందించనుంది. రాష్ట్రంలో 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు ఈ టీకా వేస్తారు. రాష్ట్రంలో ఈ వయస్సు ఉన్న అమ్మాయిలు దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ప్లానింగ్ సర్వే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతోంది. ఈ సర్వే ద్వారా 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలు ఏ స్కూళ్లల్లో ఉన్నారు..? ఎంతమంది ఉన్నారు..? బయట ఎంతమంది ఉన్నారు? అనే సమగ్ర వివరాలను సేకరిస్తోంది.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎందుకు..?
ఈ వ్యాక్సిన్ వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. హెచ్‌పీవీ అనే వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకుతుంది. మహిళల్లో దాదాపు 90 శాతం వరకు ఈ వైరస్ వల్లే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదుతున్నాయి. తెలంగాణలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడేవారు ఎక్కువమంది ఉండగా.. రెండో స్థానంలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. దీంతో దీనిని నివారించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు సిద్దమవుతోంది. దీని వల్ల మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని, ఆ వ్యాధిని అడ్డుకునే లక్షణాలు ఈ వ్యాక్సిన్‌కు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..?
లైంగిక సంబంధాలు, చిన్న వయస్సులోనే మ్యారేజ్ చేసుకోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో హెచ్‌పీవీ వైరస్ సోకుతుంది. వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. దీంతో అమ్మాయిలు యుక్త వయస్సుకు రాగానే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ బారిన పాడకుండా కాపాడుకోవచ్చు. దీంతో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఇది వేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల ఖర్చు అవుతుంది. మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి వేలల్లో ఖర్చు అవుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఆ భారం తగ్గించేందుకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ల పంపిణీకి ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.