Telangana: గోదావరి నదిలో అద్భుత దృశ్యం.. ఒక్కే శిలపై ఐదుగురు దేవీదేవుళ్ల రూపాలు

Telangana: గోదావరి నదిలో అద్భుత దృశ్యం.. ఒక్కే శిలపై ఐదుగురు దేవీదేవుళ్ల రూపాలు


Telangana: గోదావరి నదిలో అద్భుత దృశ్యం.. ఒక్కే శిలపై ఐదుగురు దేవీదేవుళ్ల రూపాలు

అది అలల సంగీతంతో వినిపించే గోదావరీ తీర ప్రాంతం.. హనుమాన్ గడ్డ వద్ద నందనవనంలా కనిపించే ఆ పెరడును నంది పెరడు అంటారు. ఆ నంది పెరడు విశిష్ఠతేంటో తెలుసుకోవాలంటే ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిని దర్శించాలి. అవును, ధర్మపురి అంటే అక్కడి స్థానికులకైనా, అక్కడికెళ్లే భక్తులు, పర్యాటకులకైనా ఓ టెంపుల టౌన్‌గా సుపరిచితం. శ్రీలక్ష్మీనృ,సింహుడు కొలువైన క్షేత్రంగా, గోదావరీ తీరంగా, శేషప్ప పద్య శతకంగా ధర్మపురి ప్రాశస్త్యానికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే, అక్కడ ఇంకా స్థానికులకే తెలియని చారిత్రక విషయాలున్నాయి. ఇక వాటి గురించి సుదూర తీరాల నుంచి వచ్చే భక్తులకుగానీ, పర్యాటకులకుగానీ తెలిసే అవకాశమే ఉండదు. అందుకే, అలాంటి ఓ విశిష్ఠమైన శిల.. దానిపైనున్న శిల్ప కళ గురించే ఈ పరిచయం.

గోదావరీ తీరంలో బ్రాహ్మణ సంఘం, హనుమాన్ ఆలయానికి మధ్యలో కనిపించేదే నంది పెరడు. ఒకనాడు యజ్ఞయాగాదులు జరిగిన ప్రాంతంగా నంది పెరడుకు పేరు. ఇదే జాగాలో ఒక అద్భుతమైన శిల్పం మనందరి కళ్లనూ కట్టి పడేస్తుంది. ఇదిగో అదే ఈ శిల్పం.

నందికి ఎదురుగా ఉన్న ఈ శిల్పంలో అన్ని గణాలకు అధిపతైన గణపతి మనకు ఈ శిలపై కాస్త పెద్ద రూపంలో కనిపిస్తాడు. అలా విఘ్నేశ్వరుడికి కాస్త కుడి పక్కకు జరిగితే.. ఒక అమ్మవారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఆ అమ్మవారే మహాలక్ష్మి. రెండు చేతుల్లో పద్మాలతో కింద పద్మాసనంతో కనిపిస్తుంది మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి నుంచి మరింత అదే కుడి వైపుకు తిరిగినప్పుడు అక్కడే మరో రూపం కనిపిస్తుంది. సృష్టికి మూలమైన ఆది విష్ణువు చేతుల్లో శంఖు, చక్రం, గద వంటివాటితో కనిపిస్తుంటే.. ఆ విష్ణుమూర్తినిన కొల్చే గరత్మంతుడూ ఇదే శిలపై దర్శనమిస్తాడు. మరోవైపు మళ్లీ మధ్యలోనున్న విఘ్నేశ్వరుడి నుంచి ఆయనకు ఎడమవైపుకు వెళ్లితే అక్కడ మహిషాసుర మర్దిని అమ్మవారు కనిపిస్తుంది. మహిషుణ్ని కింద వేసి తొక్కినట్టుగా ఆ అమ్మవారి విగ్రహాన్ని మనం గమనించవచ్చు. మహిషాసురమర్దినికి మరి కాస్త పక్కకు జరిగితే మరో నంది విగ్రహం ముందు కాళ్లతో ఆ అమ్మవారికి దండం పెడుతున్నట్టుగా ఇంకో రూపం కనిపిస్తుంది. వీటన్నింటికీ తోడు.. శిల పైన ఆ ఆదిదేవుడు, దేవదేవుడు, లయకారుడైన ఈశ్వరుడి రూపం మనకు శివలింగం రూపంలో దర్శనమిస్తుంది. ఉత్తరదిశలో ఉన్న పానపట్టంతో కనిపించే ఆ శివలింగంతో పాటు… మొత్తంగా ఒకే శిలపై చెక్కిన శిల్పకళ మనల్ని అబ్బురపరుస్తుంది.

గతంలో యజ్ఞ, యాగాదులు జరిగిన ప్రాంతంగా చెప్పుకునే ఈ గోదావరీ తీరంలోని నందిపెరట్లో ఉన్న శిల్పం వెనుక కథేంటో ఇంకా పూర్తిగా చరిత్రకారులు బయటకు తీయాల్సిన అవసరముంది. ఎందుకు ఒకే శిలపై ఇన్ని శిల్పాలను చెక్కి ఉంటారో నేటి వర్తమాన సమాజానికి తెలియపర్చాల్సి ఉండగా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కచ్చితంగా ఇక్కడి భక్తులు, పర్యాటకులు పెరిగే అవకాశముంటుంది. అలాగే, ఇప్పటివరకూ తెలియని ఒకే శిలపై నెలకొన్న ఈ విభిన్నమైన శిల్పకళను ఇక్కడికొచ్చే ఆధ్యాత్మికవాదులకు పరిచయం చేసినట్టూ ఉంటుంది.

 

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *