
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. గురుకుల విద్యార్థులకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని వేగంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. డిటైల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్‌ను ముందుగానే తయారు చేయాలని స్పష్టం చేసింది. జిల్లా షెడ్యూల్‌కు అనుగుణంగా, సంబంధిత అన్ని విభాగాలకు వాటిని అందజేయాలని స్పష్టం చేసింది. నోడల్ అధికారులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విద్యా సంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహిస్తారని వెల్లడించింది. అధికారులు గురుకుల పాఠశాలలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.