మద్యం మత్తులో ఓ అల్లుడు మృగంలా మారాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలైన అత్త (68) పై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ప్రతిఘటించి తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. కాస్త ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటి బాట పట్టింది ఆ అత్తా.. అత్త ఇంటికి వచ్చిందని తెలుసుకున్న ఆ అల్లుడు మళ్లీ అదే పాడు పనికి సిద్దమయ్యాడు. ఈసారి ఫుల్ గా తాగేసీ మద్యం మత్తులో ఆ వృద్దురాలి పై మరొసారి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో కట్టలు తెంచుకున్న ఆవేశంతో అల్లుడు పై భద్రకాళిలా మారిన ఆ అత్త.. ఆ ఉన్మాదిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్ కు చెందిన షేక్ నజీం (45) తన భార్య, కుమారుడు, అత్తమ్మతో కలిసి నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడా గ్రామానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సమీప ఇటుక బట్టీలో కూలిగా పని చేస్తున్న నజీం కొన్నేళ్ల క్రితం మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. పదిరోజుల క్రితం అతడి భార్య తాపి పని నిమిత్తం కుమారుడితో కలిసి మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్లింది. దీంతో ఇంట్లో అత్త ఒక్కతే ఒంటరిగా ఉంటుంది.. రెండ్రోజుల క్రితం మద్యం తాగి ఇంటికి వచ్చిన నజీమ్ వృద్దురాలైన ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆ వృద్ధురాలు తీవ్ర గాయాలతో స్థానికుల సాయంతో ఆసుపత్రికి చేరింది. చికిత్స చేయించుకొని సోమవారం ఇంటికి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న నజీం సోమవారం అర్ధరాత్రి ఆమెపై మరోసారి లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ఆమె పక్కనే ఉన్న కర్రతో అతన్ని బలంగా కొట్టింది.. స్పృహ తప్పి పడిపోయిన నజీం గొంతు నులిమి హత్య చేసింది. ఇలా అత్త.. ఆమె మాన ప్రాణాలను కాపాడుకుంది..
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితురాలిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. సొంత రాష్ట్రానికి వెళ్లిన మృతుడి భార్య, కొడుకు విషయం తెలుసుకుని తరోడా గ్రామానికి చేరుకుని.. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామం మహారాష్ట్రకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..