T20 World Cup 2026 : ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది..ఒమన్ అంటే మినిమం ఉంటది

T20 World Cup 2026 : ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది..ఒమన్ అంటే మినిమం ఉంటది


T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశ ముగింపు పలకగా, చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన ప్రతాపం చూపించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలోని కంగారూ జట్టు ఒమన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా కథ ముందే ముగిసిపోయినా, పరువు కోసం ఆడిన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. జింబాబ్వే, శ్రీలంక వంటి జట్ల చేతిలో అనుకోని ఓటములను ఎదుర్కొన్న ఆసీస్, సూపర్-8 రేసు నుంచి తప్పుకున్న అవమానంతో ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఒమన్ జట్టు ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి, గ్రూప్-బిలో అట్టడుగు స్థానంతో తన ప్రయాణాన్ని ముగించింది.

ఈ ఓటమితో ఒమన్ జట్టు ఒక అనవసరమైన, సిగ్గుపడాల్సిన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగా బంగ్లాదేశ్‌తో కలిసి ఒమన్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. 2016లో మొదటిసారి క్వాలిఫై అయిన ఒమన్, అప్పుడు ఒక విజయం సాధించింది. 2021లో కూడా ఒక మ్యాచ్ గెలిచింది. కానీ 2024, తాజా 2026 ఎడిషన్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. వరుస ఓటములతో ఆ జట్టు క్రికెట్ ప్రపంచంలో అత్యంత బలహీనమైన జట్టుగా ముద్ర వేయించుకుంది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్.. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ధాటికి విలవిలలాడింది. జంపా కేవలం 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్ చెరో రెండు వికెట్లతో రాణించారు. దీనివల్ల ఒమన్ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడ్డారు. 100కు పైగా పరుగుల లక్ష్యాన్ని టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఛేదించి ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.

కెప్టెన్ మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ట్రావిస్ హెడ్ 19 బంతుల్లోనే 32 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. వీరిద్దరూ కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, కేవలం 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. మార్ష్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాదాడు. ఓటమి బాధతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నా, ఈ విజయం ఆస్ట్రేలియాకు కొంత ఊరటనిచ్చింది. గ్రూప్ దశలోనే ఆసీస్ వంటి దిగ్గజ జట్టు నిష్క్రమించడం ఈ వరల్డ్ కప్‌లోనే అతిపెద్ద సంచలనంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *