Suresh Raina : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ జట్టు, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ సంచలన సెంచరీతో అదరగొట్టగా, దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ ఓటమిపై పరోక్షంగా సెటైర్ వేస్తూ రైనా చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
డబ్ల్యూసీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించినది ఏబీ డివిలియర్స్. కేవలం 60 బంతుల్లో 120 పరుగులు (నాటౌట్) చేసి, 12 ఫోర్లు, 7 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కావడం విశేషం.
డబ్ల్యూసీఎల్ ఫైనల్ తర్వాత సురేష్ రైనా, మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ఏబీ డివిలియర్స్‌ను ప్రశంసిస్తూనే ఒక సంచలన కామెంట్ చేశాడు. తన దేశభక్తిని ప్రదర్శిస్తూ భారత్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన నిర్ణయాన్ని సమర్థించాడు. ఒకవేళ భారత్ ఈ టోర్నమెంట్‌లో ఆడి ఉంటే పాకిస్తాన్‌ను ఇలాగే చిత్తు చేసేవారమని పరోక్షంగా పేర్కొన్నాడు.
రైనా తన పోస్ట్‌లో.. “ఫైనల్‌లో ఏబీ డివిలియర్స్ చాలా అద్భుతంగా ఆడాడు. మేము ఆడి ఉంటే, వాళ్లను ఇలాగే చిత్తు చేసేవాళ్ళం. కానీ, మేము మా దేశానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఈజ్ ట్రిప్, నిశాంత్ పిట్టిల నిర్ణయానికి గౌరవిస్తున్నాం. పాకిస్తాన్ తో సంబంధించిన మ్యాచ్‌లతో సంబంధం పెట్టుకోనందుకు ధన్యవాదాలు. అదే నిజమైన దేశభక్తి అంటే.” అంటూ రాసుకొచ్చాడు. రైనా చేసిన ఈ పోస్ట్ భారతీయ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అతని దేశభక్తి, సెటైర్‌ను ప్రశంసిస్తూ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
సౌతాఫ్రికా జట్టు టైటిల్ గెలుచుకోవడం, ఆ తర్వాత రైనా చేసిన వ్యాఖ్యలు డబ్ల్యూసీఎల్ 2025ను ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ డ్రామాతో ముగించాయి. భారత్ టోర్నమెంట్ నుంచి వైదొలగడం, పాకిస్తాన్ ఓటమి, సురేష్ రైనా వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..