ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా తన సెరా శానిటరీవేర్ పెట్టుబడి అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2005లో రూ. 70కి ఆ స్టాక్ కొనుగోలు చేయగా.. అనేక ఒడిదొడుకుల తర్వాత 17 ఏళ్లలో 16,200 రెట్ల రాబడిని ఇచ్చిందన్నారు. ఓపిక, సహనం, దీర్ఘకాలిక నిరీక్షణ, సరైన స్టాక్ ఎంపికతో గణనీయమైన సంపదను సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే ఒక్క స్టాక్ మీ జీవితాన్ని మార్చగలదని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన సెరా శానిటరీవేర్ కంపెనీలో చేసిన పెట్టుబడిపై కీలక విషయాలు తెలిపారు.
కేడియా 2005లో సెరా శానిటరీవేర్ షేర్లను రూ. 70 ధరకు కొనుగోలు చేశారు. 2008 నాటికి, స్టాక్ ధర రూ. 225కి పెరిగింది. అయితే మళ్లీ సంక్షోభం కారణంగా సమయంలో అది రూ. 50కి పడిపోయింది. అయినప్పటికీ, ఆయన తన షేర్లను అలాగే ఉంచుకున్నారు. ఆ తర్వాత 2008 నుంచి స్టాక్ ధర రూ. 50 నుంచి రూ. 250కి, మళ్ళీ రూ. 100కి, ఆపై రూ. 500కి, రూ. 300కి, రూ. 1500కి, రూ. 4000కి పెరిగి, కోవిడ్ సమయంలో రూ. 2000కి తగ్గి, చివరికి గత సంవత్సరం రూ. 8000కి చేరుకుంది. ఈ మధ్యలో 1:1 బోనస్ కూడా ఇచ్చిందన్నారు. రూ. 70 కొనుగోలు ధరతో పోలిస్తే, 16-17 ఏళ్లలో రూ. 250 డివిడెండ్ లభించిందన్నారు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే రెట్టింపుని చెప్పారు. చివరికి, మిగిలిన బ్యాలెన్స్‌ను రూ. 16,000కి అమ్మినప్పుడు, ఈ స్టాక్ 17 సంవత్సరాలలో 16,200 రెట్ల రాబడిని ఇచ్చిందిని చెప్పుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి, ఓపికతో ఎంతటి అద్భుతమైన రాబడిని ఆర్జించవచ్చో చెబుతోంది.