శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త చెప్పారు. ఇటీవలే స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించిన అధికారులు తాజాగా ఈ దర్శనానికి టోకెన్ పద్దతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లన్న భక్తుల సౌకర్యార్థం జూలై 1వ తేదీ నుంచి స్పర్శ దర్శనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాటు, భక్తుల రద్దీ కూడా భారీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ల ద్వారా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ టోకెన్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు ఆలయ ఈవో తెలిపారు.
శుక్రవారం పరిపాలన భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైల క్షేత్రంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వామి వారి స్పర్శ దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రస్తుతం స్పర్శదర్శనం టికెట్లు, ఆయా ఆర్జితసేవాటికెట్లను పొందినట్లుగానే భక్తులు ఉచిత స్పర్శదర్శనం టోకెన్లను సైతం ఆన్‌లైన్‌లో పొందవచ్చని తెలిపారు. ఈ టోకెన్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిని చట్టపరంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.
టోకెన్లు పొందాల్సిన వెబ్‌సైట్ వివరాలు..
స్వామివారి స్పర్శ దర్శన టికెట్‌లు వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ప్రతీ మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుండి సాయంత్రం 3.45 నిమిషాల ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. www.aptemples.ap.gov.in , www.srisailadevasthanam.org వెబ్‌సైట్‌ల నుంచి ఈ ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందవచ్చని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.