Srisailam: శ్రీశైలం నడకదారి పక్కన పొదల్లో పెద్దపులి… నిశ్శబ్దంగా భక్తులను చూసిన తర్వాత..

Srisailam: శ్రీశైలం నడకదారి పక్కన పొదల్లో పెద్దపులి… నిశ్శబ్దంగా భక్తులను చూసిన తర్వాత..


ఒకవైపు తీక్షణమైన చూపులతో దారిపక్కన పొదల్లో పెద్దపులి… మరోవైపు ఆందోళనతో కూడిన ప్రాణభయంతో పాదయాత్రగా వెళ్తున్న మల్లన్న భక్తులు. కొద్దిసేపు ఇరువైపులా చూపులతోనే ఊసులాడుకున్నట్టు నిశ్శబ్దం తాండవించింది. అనంతరం పొదల్లో నుంచి ఆ పెద్దపులి మాయం అయిపోయింది. హమ్మయ్య అనుకుంటూ పాదయాత్రగా శ్రీశైలం వెళుతున్న భక్తులు తిరిగి తమ నడక ప్రారంభించారు. నల్లమల అటవీప్రాంతంలో శ్రీశైలానికి నడకదారిలో వెళ్లే భక్తులకు ఎదురైన అనిర్వచనీయమై అనుభూతి ఇది.మల్లన్నే కాపాడాడని, అందుకే పెద్దపులి ఏం చేయకుండా వెళ్లిపోయిందంటూ భక్తజనం ఓం నమశి:వాయ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు.

మార్కాపురం జిల్లా డోర్నాల మండలంలోని సరిహద్దు సమీపంలోని దట్టమైన నల్లమల అడవిలోని పెద్దచెరువు దగ్గర కాలి నడకన శ్రీశైలం వెళుతున్న భక్తులకు పెద్దపులి తారసపడింది.. దారి పక్కన పొదల్లో కదలకుండా నిలబడ్డ పెద్దపులి భక్తులకు కనిపించింది… నిశ్శబ్దంగా భక్తులను గమనిస్తూ నిలబడ్డ పెద్దపులిని చూసి తొలుత భక్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే ముందుగానే నడకదారిలో అటవీశాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో ఎవరూ కదలకుండా నిలబడిపోయారు. అలా కాకుండా భయంతో అటూ ఇటూ పరిగెత్తితే పెద్దపులి దాడి చేసే అవకాశం కల్పించినట్టవుతారని ముందే తెలిసి ఉండటంతో భక్తులు గమ్మున నిలబడిపోయారు. కొద్దిసేపు భక్తులను గమనించిన పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు తిరిగి తమ నడక ప్రారంభించారు.

వెంకటాపురం నుండి కాలి నడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు పెద్దచెరువు వద్ద ఉన్న అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళుతున్న వాహనదారులు తమ వాహనం నుంచే పెద్దపులి దృశ్యాలను చిత్రీకరించారు. వాహనం నుంచి పులి సెల్ ఫోన్‌లో రికార్డు చేసి ఆ దారిలో వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు… అభయారణ్యం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకుంటూ తమ ప్రయాణం సాగించాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *