
మఖానా గురించి తెలియని వారుండరు. అదేనండీ తామర గింజలు. వీటితో రకరకాల వంటకాలు, స్నాక్స్ చేసుకుని ఆరగిస్తూ ఉంటారు. అయితే ఇవి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా గొప్ప వరం లాంటివని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇది పోషకాల నిధి. అందుకే ఆహారంలో వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని కొనడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. అలాగే శనగలు కూడా ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి మఖానా, శనగలు రెండూ ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక శనగల్లో మాత్రం ఐరన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మంచివి. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
మఖానా ఆరోగ్య ప్రయోజనాలు..
చాలా మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద మఖానాను తీసుకోవడం అలవాటు. దీనితో పాటు రాత్రిపూట నానబెట్టిన శనగలను కూడా ఉదయం అల్పాహారం కోసం తీసుకుంటారు. వేయించిన మఖానా, నానబెట్టిన శనగలు.. ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. కానీ ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తితే మాత్రం.. శనగలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవల్సి ఉంటుంది. నిజానికి.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ పోషకాలు, ఉపయోగ పద్ధతుల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. వేయించిన మఖానాలో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా వేయించవచ్చు. అంతేకాదు, ఇది సులభంగా జీర్ణమవుతుంది కూడా. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.
శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
నానబెట్టిన శనగల్లో ప్రోటీన్, ఐరన్, భాస్వరం, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు శనగలు శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలకు పోషణ ఇస్తాయి. అవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. శనగలను నానబెట్టడం వల్ల శరీరంలో పోషకాల శోషణ పెరుగుతుంది. అంతే కాదు, అవి జీర్ణం కావడం కూడా సులభం. జీర్ణ సమస్యలు లేని వారు ఉదయం నానబెట్టిన శనగలను తినవచ్చు, ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు మంచిది.
ఏది మంచిదంటే..?
బరువు తగ్గాలనుకునేవారికి.. సులభంగా జీర్ణమయ్యే వేయించిన మఖానా మంచి ఎంపిక. ఒకవేళ ఎక్కువ ప్రోటీన్ అవసరమైతే, నానబెట్టిన శనగలు తినవచ్చు. ఆయా శరీర అవసరాలను బట్టి వీటిల్లో ఏదో ఒకటి తినవచ్చు. లేదంటే రెండింటినీ ఆహారంలో సమతుల్య పద్ధతిలో చేర్చుకోవచ్చు. మఖానా ఖరీదైనదిగా భావిస్తే.. తక్కువ ధరకు లభించే శనగలు తీసుకోవవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.