గడిచిన కొద్ది రోజులుగా వెండి మార్కెట్‌లో వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 29న కిలో వెండి ఏకంగా రూ. 4,20,000 మార్కును తాకి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ తర్వాత కేవలం కొన్ని రోజుల్లోనే ధర దాదాపు 46 శాతం వరకు పడిపోయింది. అసలే పెళ్లిళ్ల సీజన్. మరిప్పుడు వెండి కొనుక్కోవడం బెటరా? లేక మార్చి వచ్చే వరకు వేచి చూడాలా? అనే విషయాలను తెలుసుకుందాం..
ధరలు ఎందుకు తగ్గాయి?
వెండి ధర ఒక్కసారిగా రూ. 2 లక్షల వరకు తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. రేట్లు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం మొదటి కారణం. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో ద్రవ్యత కొరత అమెరికా వడ్డీ రేట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి వెండి ధరలను భారీగా తగ్గించాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి
ప్రస్తుతం మన దేశంలో కిలో వెండి ధర రూ. 2,25,000 నుంచి రూ. 2,85,000 మధ్య ట్రేడవుతోంది. సాంకేతిక పరంగా చూస్తే, వెండి ధర ప్రస్తుతం స్వల్పకాలిక మద్దతు ధర (Support) వద్ద ఉంది. ఇది 80 డాలర్లు దాటితే ధరలు మళ్ళీ పెరిగే అవకాశం (Bullish Trend) ఉంటుంది. ఒకవేళ $70 కంటే తక్కువకు పడిపోతే, ధర రూ. 2,00,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది.
మార్చి వరకు వేచి చూడాలా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2026లో అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో డాలర్ బలహీనపడవచ్చు. డాలర్ విలువ తగ్గితే వెండికి డిమాండ్ పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు (Long Term) వెండి ఎప్పుడూ లాభదాయకమే. ఎందుకంటే సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సరఫరా తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో వెండి మళ్ళీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి, కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.