పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఇప్పటివరకు 43మంది కార్మికులు మరణించగా.. ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం భారీ వర్షం పడడంతో సహాయక చర్యలు నిలిచిపోగా.. ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందన్న సీఎం.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్ లో పోలీసులు సంచలన విషయాలు నమోదు చేశారు. సిగాచీ కంపెనీలో పాత మిషనరీనే ఇంకా వాడుతున్నారని.. కొత్త మిషనరీ తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోలేదని సాయి యశ్వంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. ఉద్యోగుల మరణాలకు కంపెనీయే కారణమని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఎట్టకేలకు కంపెనీ ప్రతినిధులు ఘటనాస్ధలానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రమాదస్థలానికి మీనాక్షి నటరాజన్..
మరోవైపు ఇవాళ ప్రమాద స్థలాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఇంచార్జ్ మీనాక్షి.. నటరాజన్ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. ప్రమాదస్థలం భయానకంగా ఉందని మీనాక్షి అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..