Shubman Gill : టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన గిల్, ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇది అతనికి నాలుగోసారి ఈ అవార్డు గెలుచుకునే అవకాశం వచ్చింది. జూలై 2025కు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ ఉన్నారు.
జూలై నెలలో శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో 94.50 సగటుతో ఏకంగా 567 పరుగులు చేశాడు. ఇందులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. అంతేకాకుండా, నాలుగో టెస్టులో 103 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గిల్ ఇప్పటికే మూడు సార్లు (జనవరి 2023, సెప్టెంబర్ 2023, ఫిబ్రవరి 2025) ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ అవార్డును అందుకోవాలని ఆశిస్తున్నాడు.
సౌతాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో అతను 265.50 సగటుతో 531 పరుగులు చేశాడు. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు, రెండో టెస్టులో కెప్టెన్‌గా 367 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జూలైలో భారత్‌తో ఆడిన మూడు టెస్టుల్లో స్టోక్స్ 50.20 సగటుతో 251 పరుగులు చేసి, 26.33 సగటుతో 12 వికెట్లు తీశాడు. లార్డ్స్, మాంచెస్టర్ టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఈ ముగ్గురిలో ఎవరు ఈ నెల అవార్డును గెలుచుకుంటారో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..