బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కార కేసులో ఈ తీర్పు ఇచ్చినట్లు బంగ్లాదేశ్ స్థానిక మీడియా నివేదిక తెలిపింది. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం.. హసీనాకు విధించిన శిక్షను అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది.
హసీనాతో పాటు గైబంధలోని గోవిందగంజ్‌కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్‌కు కూడా ట్రిబ్యునల్ రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ ఢాకాకు చెందిన రాజకీయ నేత, అవామీ లీగ్ విద్యార్థి విభాగం అయిన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (BCL)తో సంబంధం కలిగి ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా షకీల్ అకాంత్ బుల్బుల్‌తో చేసినట్లుగా లీక్ అయిన ఫోన్ కాల్ ఆధారంగా ఆమెపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఆ ఆడియోలో హసీనాగా మాట్లాడుతూ.. “నాపై 227 కేసులు నమోదయ్యాయి, కాబట్టి నేను 227 మందిని చంపడానికి లైసెన్స్ పొందాను” అని చెప్పినట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం.. హసీనా మాట్లాడిన మాటలు న్యాయ ప్రక్రియను బెదిరించేలా ఉందని, దేశంలో గత ఏడాది జరిగిన సామూహిక తిరుగుబాటుకు సంబంధించిన, ప్రస్తుతం కొనసాగుతున్న నేరాల విచారణల్లో పాల్గొనే వారిని బెదిరించడానికి ప్రయత్నించినట్లుగా ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. పదవీచ్యుతురాలైన అవామీ లీగ్ చీఫ్‌ను పదవి నుంచి తొలగించి 11 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత ఆమె ఒక కేసులో దోషిగా తేలడం, శిక్ష పడటం ఇదే మొదటిసారి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి