Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి.. టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌..! బాక్సాఫీస్ సంగ్రామంలో నాలుగు దిగ్గజాలు

Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి.. టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌..! బాక్సాఫీస్ సంగ్రామంలో నాలుగు దిగ్గజాలు


సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే పండుగ సీజన్‌లో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2027 సంక్రాంతి వేదికగా జరగబోతున్న ఈ పోరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో, నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ యాక్షన్‌తో, కింగ్ నాగార్జున తన సోగ్గాడి మ్యాజిక్‌తో, విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ నలుగురు అగ్ర నటులు ఒకే సీజన్‌లో పోటీ పడటం అనేది ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులకు కూడా కన్నుల పండుగే అని చెప్పాలి. ఈ మహా సంగ్రామంలో ఎవరెవరు ఏ సినిమాలతో రాబోతున్నారు, ఆ చిత్రాల విశేషాలేంటో తెలుసుకుందాం..

మెగాస్టార్ – బాబీ కొల్లి..

‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్ళీ చేతులు కలుపుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించడంలో బాబీ సక్సెస్ అయ్యారు, కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని పక్కాగా ప్లాన్ చేశారు. మెగా మాస్ జాతరతో పండుగకు ఊపు తీసుకురావడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు.

బాలయ్య – గోపీచంద్ మలినేని..

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ ఎంతో అచ్చొచ్చిన కాలం. ఇప్పటికే ‘వీరసింహ రెడ్డి’తో పొంగల్ రేసులో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య, మళ్ళీ అదే దర్శకుడు గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ కూడా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. బాలయ్య మార్కు డైలాగులు, గోపీచంద్ మలినేని టేకింగ్ తో బాక్సాఫీస్ వద్ద పవర్ ఫుల్ పోటీ ఇవ్వడానికి నందమూరి సింహం రెడీ అయిపోయింది.

నాగార్జున ‘సోగ్గాడి’ హ్యాట్రిక్ ప్లాన్..

కింగ్ నాగార్జున సంక్రాంతికి వస్తే అది కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు పండగే. ‘సోగ్గాడే చిన్న నాయన’, ‘బంగార్రాజు’ సినిమాలతో ఇప్పటికే సంక్రాంతి హిట్స్ అందుకున్న నాగార్జున, ఇప్పుడు అదే సిరీస్ లో మరో సీక్వెల్ తో వస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. సోగ్గాడి సందడితో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని నాగ్ భావిస్తున్నారు.

వెంకీ – అనిల్ రావిపూడి..

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే వినోదానికి గ్యారెంటీ. ఇప్పటికే F2, F3, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ఈ జంట హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు నాలుగోసారి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. సంక్రాంతిని తన సొంత సీజన్ గా మార్చుకున్న అనిల్ రావిపూడి, తన ఫేవరెట్ హీరో వెంకటేష్ తో కలిసి మరోసారి నవ్వుల విందు వడ్డించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతి బరిలోనే ఉండటం విశేషం. టాలీవుడ్ టాప్ ఫోర్ హీరోల సినిమాలు ఒకేసారి రావడం అనేది అభిమానులకు కన్నుల పండుగే. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, సినిమా ప్రేమికులకు మాత్రం ఇది ఒక అరుదైన విందు అని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *