Sanju Samson : ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో ఒకరైన సంజూ శాంసన్, త్వరలో తన జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు వీడ్కోలు పలకవచ్చని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారని, త్వరలో జైపూర్ ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పదేళ్లకు పైగా ఆడిన స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్, ఇప్పుడు ఆ జట్టును వీడబోతున్నారనే వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2026 సీజన్ ముందు అతను కొత్త అవకాశాలను వెతుక్కునేందుకు వేరే జట్టులోకి వెళ్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పుకార్లపై సంజూ శాంసన్ తొలిసారి స్పందించారు. రాజస్థాన్‌తో తనకున్న అనుబంధం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
రాజస్థాన్ రాయల్స్‌తో తన బంధం గురించి సంజూ శాంసన్ సహచర క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ తనకు కేవలం ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదని, తన క్రికెట్ కెరీర్‌కు పునాది వేసిన కుటుంబం అని ఆయన వివరించారు. సంజూ మాట్లాడుతూ.. రాజస్థాన్ రాయల్స్ నా కుటుంబం లాంటిది. నేను కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఒక యువకుడిని. నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తున్నప్పుడు, రాహుల్ ద్రవిడ్ సర్, మనోజ్ బడాలే సర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్‌లో స్థిరపడకముందే వారు నా కెపాసిటీని నమ్మారు. ఆ నమ్మకం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ ఫ్రాంచైజీతో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు.
సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులోకి వెళ్లే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రతి సీజన్లోనూ చర్చ జరుగుతోంది. అందుకే సీఎస్‌కే జట్టు సంజూను ఒక దీర్ఘకాలిక కెప్టెన్‌గా చూస్తున్నట్లు సమాచారం. సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌లో చేరారు. పదేళ్లకు పైగా జట్టుకు ముఖ్య ఆటగాడిగా ఉన్నారు. ఇప్పటివరకు 144 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4,000కు పైగా పరుగులు సాధించారు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియా టీ20 జట్టులో కూడా రెగ్యులర్ ప్లేయర్‌గా మారారు. రాబోయే ఆసియా కప్ 2025లో భారత జట్టు తరఫున కీలక పాత్ర పోషించనున్నారు. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగినా, లేకపోయినా, ఐపీఎల్ చరిత్రలో అతని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..