Sanathnagar TIMS: సర్కార్ గుడ్‌న్యూస్.. సనత్‌నగర్ టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..

Sanathnagar TIMS: సర్కార్ గుడ్‌న్యూస్.. సనత్‌నగర్ టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..


హైదరాబాద్‌, ఫిబ్రవరి 13: హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్‌, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు.

1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. హాస్పిటల్‌ అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు (OTs) శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్‌ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్‌స్టాలేషన్ జరుగుతోందన్నారు. మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు, ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్ ప్రారంభమయ్యే నాటికి టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్‌‌, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవమార్పిడి శస్ర్త చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు చివరి దశలో ఉన్నాయని, ఓటీలు ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్‌పై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆయా హాస్పిటళ్లలో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి, త్వరితగతిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఇవి కూడా చదవండి

నాన్‌ మెడికల్ సర్వీసెస్‌పై స్పెషల్ ఫోకస్

హాస్పిటల్ నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. పూర్తిగా కొత్త హాస్పిటల్ అయినందున.. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను సనత్‌నగర్ టిమ్స్‌లో వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే, పారిశుధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే నగరంలోని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌, నిమ్స్‌, ఎయిమ్స్‌లో అనుసరిస్తున్న పద్ధతులను డీఎంఈ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి, నివేదిక అందజేసింది. ఆయా హాస్పిటల్స్‌లో అవలంభిస్తున్న బెస్ట్ ప్రాక్టీస్‌ విధానాలనే టిమ్స్‌లోనూ అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్‌తో పాటు సానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్‌ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

టెక్నాలజీతో మెరుగైన సేవలు..

రోగులకు ఓపీ (OP) రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్‌ఎంఐఎస్ (e-HMIS) సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి సూచించారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 15 నాటికి పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి, ఉగాది నాటికి హాస్పిటల్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *