ఏఐ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా తన అత్యాధునిక మోడల్ జీపీటీ-5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ కొత్త మోడల్ జీపీటీ-5ను శుక్రవారం అధికారికంగా లాంచ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఇండియాలో ఏఐ వినియోగంపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెరికా తర్వాత ఓపెన్ఏఐకి అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత్ అని ఆయన అన్నారు. ఇండియాలో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని, ఈ స్పీడ్ చూస్తుంటే.. అతి తక్కువ సమయంలోనే భారత్ ఏఐ వినియోగంలో ఆమెరికాను క్రాస్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌లో సాధారణ ప్రజల నుంచి వ్యాపార సంస్థల వరకు ప్రతి ఒక్కరు ఏఐ వినియోగించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఏఐతో భారతీయులు చేస్తున్న వినూత్న ప్రయోగాలు చాలా గొప్పగా ఉన్నాయని ఆయన తెలిపారు. దీన్ని ఇలానే కొనసాగించడానికి భారత్‌లో ఓపెన్‌ఏఐ ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన అన్నారు.
భారత్‌లో తమ సంస్థ ఉత్పత్తులను పెంచడానికి స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో అయిన శామ్ ఆల్ట్‌మన్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో దేశంలో ఓపెన్ ఏఐ సంస్థ ఉత్పత్తులను పెంచే దిశగా స్థానిక కంపెనీలతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.