Rohit Sharma : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఓవల్ స్టేడియానికి వచ్చాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోహిత్, మూడో రోజు ఆటను వీక్షించేందుకు స్టేడియంలో కనిపించాడు. ఆ సందర్భంగా అతను ధరించిన దుస్తులు, ముఖ్యంగా చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆ వాచ్ ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.
ఓవల్ టెస్ట్ మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ బ్లాక్ డెనిమ్ షాకెట్ మరియు జీన్స్‌లో చాలా సాధారణంగా కనిపించాడు. అయితే, అతని చేతికి ఉన్న ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్‌ట్రా-థిన్ స్మోక్డ్ బర్గుండీ టైటానియం వాచ్ చాలా స్పెషల్. ఈ వాచ్ ధర దాదాపు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా. మ్యాచ్ చూసేందుకు వచ్చిన రోహిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ROHIT SHARMA HAS ARRIVED AT THE OVAL TO SUPPORT TEAM INDIA. 🇮🇳pic.twitter.com/kmo3O9bRjl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2025
మూడో రోజు ఆటలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్, ఆట తర్వాత రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. పోస్ట్-మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో జైస్వాల్ మాట్లాడుతూ.. “నేను రోహిత్ భాయ్‌ను చూసి హాయ్ చెప్పాను. అతను నన్ను చూసి నువ్వు బ్యాటింగ్ చేస్తూ ఉండు అని మాత్రమే చెప్పారు” అని తెలిపాడు. సెంచరీ గురించి మాట్లాడుతూ.. “పిచ్ కొంచెం స్పైసీగా ఉంది. కానీ నేను బ్యాటింగ్ ఎంజాయ్ చేశాను. ఇంగ్లండ్‌లో ఇలాంటి పిచ్‌లపై ఆడతామని నాకు తెలుసు. నేను మానసికంగా సిద్ధమయ్యాను. ఏ షాట్లు ఆడాలనేది నాకు తెలుసు” అని చెప్పాడు.
యశస్వి జైస్వాల్ మూడో రోజు ఆటను నైట్‌వాచ్‌మెన్ ఆకాశ్ దీప్‌తో కలిసి ప్రారంభించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 150 బంతుల్లో 107 పరుగులు జోడించి ఇంగ్లండ్ బౌలర్లను ఇబ్బందిపెట్టారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (40 పరుగులు), రవీంద్ర జడేజా (44 పరుగులు)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. జైస్వాల్ కేవలం 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి తన ఆరో టెస్ట్ సెంచరీని సాధించాడు. జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..