టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి గ్రౌండ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇకపై వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నారు. ఈ సమయంలో.. ఈ ఇద్దరు మాజీ కెప్టెన్ల గురించి ఒక షాకింగ్ న్యూస్ వినబడుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. నివేదికల ప్రకారం.. ఈ పర్యటన రోహిత్, విరాట్‌ల చివరి పర్యటన కావచ్చ. ఈ ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడవచ్చు.
బీసీసీఐ కొత్త వ్యూహం..
ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలనే కోరికను వ్యక్తం చేశారు. అయితే వారి కోరిక ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియాలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా కనిపించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో యువతకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్రణాళికలు చేస్తుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మరింత కాలం ఆడాలనుకుంటే డిసెంబర్‌లో వన్డే ఫార్మాట్‌లో జరిగే దేశీయ సిరీస్ విజయ్ హజారే ట్రోఫీలో వారు తమ రాష్ట్ర జట్ల తరపున ఆడాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు.
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవంగా రాణించారు. దీని తర్వాత వారు రంజీ ట్రోఫీలో ఆడవలసి వచ్చింది. కానీ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇక్కడ కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత వారు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. రోహిత్ , కోహ్లీ ఈ సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమ్ ఇండియా తరపున ఆడారు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కానీ వారి ముందు బీసీసీఐ రిటైర్‌మెంట్ షరతులను పెట్టే అవకాశం ఉంది.
రోహిత్ – కోహ్లీ గణాంకాలు
కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌ను 2007లో మొదలు పెట్టాడు. అతను ఇప్పటివరకు 273 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో 48.76 సగటుతో 11186 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. లెజండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 2008లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 302 వన్డేలు ఆడాడు. ఇందులో 57.88 సగటుతో 14181 పరుగులు ఉన్నాయి. ఈ సమయంలో అతను 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు చేశాడు.
ఆస్ట్రేలియా టూర్
అక్టోబర్ 19: మొదటి వన్డే (పెర్త్)
అక్టోబర్ 23: రెండవ వన్డే (అడిలైడ్)
అక్టోబర్ 25: మూడవ వన్డే (సిడ్నీ)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..