ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు అంతటా యూపీఐ పేమెంట్సే. యూపీఐ భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది. ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు లేవు. దీంతో ప్రతి ఒక్కరు దీనిని వాడుతున్నారు. కానీ భవిష్యత్‌లో ఫ్రీగా ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. UPI సేవలు ఎల్లప్పుడూ ఉచితంగా ఉండదని అన్నారు. ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నడపడంలో కొంత ఖర్చు ఉంటుందని.. ఈ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత జరిగిన సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ ఈ ప్రకటన చేశారు. యూపీఐ వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే కొన్ని ఛార్జీలను భరించాలని అన్నారు. కాగా ప్రస్తుతం బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్స్‌కు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఇక్కడ ఎవరో ఒక్కరు ఖర్చును భరిస్తున్నారని సంజయ్ మల్హోత్ర అన్నారు. కానీ ఆదాయం ఆశించకుండా ఏ సంస్థ అయినా ముందుకు సాగడం కష్టమని.. కస్టమర్లు కొంత భారం భరించాల్సి ఉంటుందని గతంలోనే గవర్నర్ అభిప్రాయపడ్డారు. వెంటనే కాకున్నా.. భవిష్యత్తులో యూపీఐ సేవలకు ఛార్జీలు ఉంటాయని నొక్కి చెప్పారు.
ఐసీఐసీఐ మొదటి అడుగు
ఇప్పటికే ఐసీఐసీఐ యూపీఐ సేవలపై ఛార్జీలు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు లావాదేవీ ఆధారంగా అగ్రిగేటర్‌ల నుంచి ఛార్జ్ వసూలు చేస్తుంది. 100 రూపాయలకు 2 పైసల వరకు ఈ ఛార్జ్ ఉంటుందని తెలుస్తోంది. లావాదేవీకి గరిష్టంగా 6 రూపాయలు ఉండనుంది. ఐసీఐసీలో ఎస్క్రో ఖాతా లేని వారికి.. లావాదేవీకి గరిష్టంగా రూ.10 ఛార్జ్ చేయనుంది. వ్యాపారికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా ఉండి, లావాదేవీ దాని నుండే జరిగితే ఎటువంటి ఛార్జీలు ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..