Rakhi Flower: వావ్.. ప్రకృతిలో మరో అద్భుతం..! అట్రాక్ట్ చేస్తున్న రాఖీ పువ్వులు.. వాటి గురించి తెలుసా..?

Rakhi Flower: వావ్.. ప్రకృతిలో మరో అద్భుతం..! అట్రాక్ట్ చేస్తున్న రాఖీ పువ్వులు.. వాటి గురించి తెలుసా..?


రక్షాబంధన్..! అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పండుగను రాఖీ పౌర్ణమి అంటారు. శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున తోబుట్టువుల మధ్య అనుబంధం ఆప్యాయతల పండుగ ఇది. కుల మతాలకతీతంగా రాఖి సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే.. మార్కెట్లో చాలా రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. పది రూపాయల నుంచి వేల రూపాయల్లో కూడా రాఖీ ఉంటుంది. వెండి, బంగారం తో కూడిన రాఖీలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. అయితే.. పర్యావరణ ప్రేమికుల కోసం ఈ సీజన్లో ప్రత్యేకంగా ఓ రాఖి ఆకర్షిస్తోంది. అదేనండి రాఖీ లాంటి పుష్పం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు తెగ నచ్చేస్తుంది.

రాఖీ ఫ్లవర్.. దీన్నే కృష్ణ కమల్ అని కూడా అంటారు. శాస్త్రీయ నామం పాసీ ఫ్లోరా. దీన్నే ఫ్యాషన్ ఫ్లవర్.. రక్షాబంధన్ ఫ్లవర్.. ఫ్రెండ్‌షిప్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం విశాఖలోని మొక్క జాతుల విజ్ఞాన భాండాగరంగా పేరుపొందిన బయోడైవర్సిటీ పార్కులో ఈ పుష్పం విరబూసింది. రాణి చంద్రమదేవి ఆసుపత్రి ప్రాంగణంలో.. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోడైవర్సిటీ పార్క్ రూపుదిద్దుకుంది. గత 24 ఏళ్లుగా ఇక్కడ వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ రామమూర్తి. ఇక్కడ రకరకాల ఫల, పుష్ప, ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. చిన్న మొక్క నుంచి భారీ వృక్షాల వరకు ఈ ఉద్యానవనంలో ఒకే చోట కనిపిస్తాయి. ఎడారి మొక్కలు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు ఇక్కడ మొక్కలు విజ్ఞానాన్ని అందించాయి.

ఈ బయోడైవర్సిటీ పార్కులో రాఖీ ఫ్లవర్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసంలోనే ఈ పుష్పాలు విరబూస్తుంటాయి. రాఖీని పోలిన ఈ పుష్పాలు ప్రకృతి ప్రేమికులకు ఈ రాఖీ పండగ పూట తెగ నచ్చేస్తుంటాయి. ఇక్కడకు ప్రత్యేకంగా ఈ పూలను చూసేందుకు క్యూ కడుతుంటారు. ఈ పూలతో ఎంచక్కా ఫోటోలు తీసుకుంటూ.. ఈ పూల విశేషాలను తెలుసుకుంటున్నారు. కొంతమంది చేతికి పెట్టుకొని ప్రకృతి సృష్టించిన రాఖిని చూసి తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే ఇది తీగజాతి మొక్కకు పూసిన పుష్పం కావడంతో పువ్వుతో పాటు ఇరువైపులా తీగ కూడా చేతికి కట్టుకునేందుకు అనవుగా ఉంటుంది.

పుష్పాన్ని కృష్ణ కమల్ కూడా అంటారు. ఎందుకంటే నీలం రంగులో ఆకర్షిస్తూ విరబూస్తుంది. ఇది అసాధారణమైన, అందమైన పుష్పం. కృష్ణుడి రంగులో ఆకర్షిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది ఈ కృష్ణ కమల్‌ను భక్తి భావంతోనూ చూస్తారు. ఇటువంటి మొక్కలు పెంచడం ద్వారా ప్రకృతి ప్రసాదించిన రాఖీల అనుభూతిని పొందవచ్చని అంటున్నారు ప్రొఫెసర్ రామమూర్తి. ప్లాస్టిక్ రాఖీల జోలికి వెళ్లకుండా ఇలా ప్రకృతిలో దొరికే రాఖీ ఫ్లవర్స్ విరబూసే మొక్కలు పెంచితే.. పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అవగాహన కల్పిస్తున్నారు. అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రకృతిలో దొరికే ఈ పుష్పం ప్రతీక అని అంటున్నారు. ఈ మొక్క జాతుల్లో ఐదారు రకాలు ఉంటాయి. వాటిలో పింక్, వైట్, రెడ్, ఎల్లో రంగుల ఫ్లవర్స్ కూడా ఉంటాయి. కానీ నీలం రంగులో ఉండే ఆ పుష్పం ప్రత్యేకతే వేరు.

ఎన్నో ఔషధ గుణాలు..!

కృష్ణ కమలం.. మానసిక స్థితిని పెంచేదిగా పనిచేస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ఎందుకంటే అందులో ఉన్న కలర్ కాంబినేషన్ చూడగానే ఓ రకమైన ఆనందం.. ఆకర్షణ కలుగుతుందని చెబుతున్నారు. కృష్ణ కమల్ పువ్వులు ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి, నిరాశ ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. దీన్ని మూలికా సప్లిమెంట్‌గా వినియోగిస్తారని చెబుతున్నారు.

ఈ మొక్కను ఎలా పెంచాలి..

అందమైన పుష్పాన్ని అందించే ఇది ఒక తీగజాతి మొక్క.. కృష్ణ కమల్ దుంపను తీసి నాటితే దాన్నుంచి మరో మొక్క వస్తుంది. దాని మొలకను తీసుకొని నాటినా ఆ మొక్క పెరుగుతుంది. మొలకను మట్టిలో దాదాపు 7 అంగుళాల లోతు వరకు ఉంచాలి. మొలకెత్తడానికి తగినంత నీరు పోయాలి. నేల తేమగా ఉంచాలి. ఇదండీ రాఖీ ఫ్లవర్.. ఆ మొక్క విశేషాలు..! మీరు మీ ఇళ్లలో ఎటువంటి మొక్కలు పెంచితే.. పర్యావరణ పరిరక్షణలో మీరు కూడా భాగం పంచుకున్నట్టే..సో.. ఈ రక్షాబంధన్ కైనా పర్యావరణానికి హితం చేసే పచ్చని మొక్కలు పెంచాలని ప్రామిస్ చేద్దాం.. !

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *