ఈ నెల(ఫిబ్రవరి) 23 వరకు వరుసగా, బుధ, శుక్ర, రవి, కుజ గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. గ్రహాలు మారినప్పుడు కొన్ని రాశులు అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు అందుతాయి. ఈ విధమైన గ్రహాల రాశి మార్పు వల్ల ప్రస్తుతం ఆరు రాశులకు గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు తప్పకుండా అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమలు వంటి విషయాల్లో ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ అనుకూల సమయం దాదాపు రెండు నెలల వరకూ కొనసాగే సూచనలున్నాయి.
- మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి దశమ, లాభ స్థానాల్లో ఉండడంతో పాటు లాభ స్థానంలో నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవ కాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- వృషభం: ఈ రాశివారికి శుభ గ్రహాలన్నీ ప్రస్తుతం అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి, వ్యాపారాల్లో లాభాలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి.
- సింహం: నాలుగు గ్రహాలు రాశి మారడంతో పాటు, సప్తమ స్థానంలో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడడం జరుగుతుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సిరిసంపదలు వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- తుల: ఈ రాశివారికి ఈ నాలుగు గ్రహాలతో పాటు, రాహు కేతువులు కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. నిరుద్యోగులు ఊహించని జీతభత్యాలతో మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఎక్కువ గ్రహాలు యుతి చెందడం వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు గ్రహ బలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూ లంగా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగపరంగా శుభ వార్తలు వింటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- మకరం: ఈ నెలలో రాశిమారిన నాలుగు గ్రహాలు ఈ రాశికి ధన స్థానంలో చేరడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. అనేక విధాలుగా విశేషంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఊహించని విధంగా ధన యోగం పడుతుంది. అదనపు ఆదాయానికి, అదనపు రాబడికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.