హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా భారీ శబ్దంతో పిడుగు పడింది. రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిడుగుపడి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
వీడియో చూడండి:
వారం రోజుల గ్యాప్ తర్వాత.. రెండు రోజుల ఉక్కబోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారు. మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో కూడిన వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి.
గాలిలో తేమ పెరగటంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్లు హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. షేక్‌పేట్‌లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. కుత్బుల్లాపూర్‌లో 10.7 CM, ఖైరతాబాద్‌లో 10.2CM.. కూకట్‌పల్లిలో 8.7, అమీర్‌పేట్‌లో 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. బాలానగర్, ఆసిఫ్‌నగర్‌లో 7.5 సె.మీ. వర్షపాతం పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు IMD ప్రకటించింది. తెలంగాణలో మోస్తరు వర్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటించారు. 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.