రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లతో కూడిన అత్యంత పోషకమైన తృణధాన్యం. అందుకే.. రాగి జావ తాగమని (Ragi Java) ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇది అత్యంత ఆరోగ్యకరమైన పౌష్టికాహారం.. రాగిజావ.. అద్భుతమైన శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. బరువు తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు.. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారికి లేదా ఎక్కువ కష్టపడి పనిచేసేవారికి ఇది ఒక అద్భుతమైన ఎనర్జీ డ్రింక్..
రాగి జావ వంటకాలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడినవి. నేటి తరం ఆహారపు అలవాట్లలో ప్రోటీన్ కొరత సాధారణం అయిన నేపథ్యంలో, ఈ రాగి జావను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాగిలో పుష్కలంగా ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది శరీరానికి తక్షణ శక్తినిచ్చి, ఎముకలను ఉక్కులా దృఢంగా మారుస్తుంది.
రాగి జావ, మజ్జిగ రాగి జావలను తయారుచేసుకుని తాగవచ్చు.. ఈ రెండు రకాల జావలు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి లేదా నీరసంగా, బలహీనంగా అనిపించేవారికి ఈ రాగి జావ ఒక అద్భుతమైన ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఉదయం టిఫిన్ చేయలేని లేదా ఏమి చేయాలని తోచని సమయాల్లో ఈ రాగి జావను సులభంగా తయారుచేసుకుని తీసుకోవచ్చు. ఇది భోజనం సమయం వరకు ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
ఇవి కూడా చదవండి
రాగి జావ తయారీ విధానం:
మొదటగా ఒక పెద్ద గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ పిండి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఆ తరువాత, మరో రెండు గ్లాసుల నీళ్లు కలిపి (మొత్తం మూడు గ్లాసుల నీళ్లు), పిండి పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, జావ అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. మూడు నుండి నాలుగు నిమిషాల్లో జావ మరగడం ప్రారంభమవుతుంది. పైన వచ్చే నురుగును తీసివేయాలి. జావ కాస్త చిక్కబడే వరకు మూడు నుండి నాలుగు నిమిషాలు మరిగించి, ఐదారు సార్లు రోలింగ్ బాయిల్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తరువాత ఇది మరింత చిక్కబడుతుంది.
రాగి జావను పలు రకాలుగా తయారు చేసుకోవచ్చు.. స్వీట్ లేదా స్వీట్ లేకుండా తయారు చేసుకోవచ్చు.. కొంచెం బెల్లం లేదా ఉప్పు ఇంకా పాలు లేదా మజ్జిగ కలుపుకుని తాగవచ్చు.. ఈ మజ్జిగ జావను ఉల్లిపాయ కాంబినేషన్ తో తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.
ఈ రెండు రకాల రాగి జావలు కేవలం టేస్టీగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తమ డైట్లో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..