Puncture Scam: అరెయ్ పురుగులు పట్టి పోతార్రా.. పంక్చర్ కోసం వెళ్తే రూ.8వేలు పిండేశారు..

Puncture Scam: అరెయ్ పురుగులు పట్టి పోతార్రా.. పంక్చర్ కోసం వెళ్తే రూ.8వేలు పిండేశారు..


ప్రతి రోజు కొత్త కొత్త స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. మోసానికి కాదేది అనర్హం అన్నట్లుగా కొత్త పద్ధతుల్లో ప్రజల డబ్బును లూటీ చేస్తున్నారు. డబ్బు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకునేది పంక్చర్ షాపుల్లో జరిగే స్కామ్ గురించి.. అవును ఈ ఘటన మీకు ఎదురై ఉండొచ్చు. పెట్రోల్ బంకుల్లో గాలి కొట్టించడానికి వెళ్లినప్పుడు లేదా పంక్చర్ షాపులకు వెళ్లినప్పుడు షాపువాళ్లు కేవలం గాలితో ఆగడం లేదు. పంక్చర్ అయినా కాకున్నా పంక్చర్ అయ్యిందంటూ చెప్పడం.. పైసలు లాగడం కామన్‌గా మారింది. హైదరాబాద్ సహా పెద్ద పెద్ద పట్టణాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. తాజాగా గురుగ్రామ్‌లో ఓ వ్యక్తికి ఇటువంటి ఘటనే ఎదురైంది. పంక్చర్ కోసం వెళ్తే ఏకంగా రూ.8000 వదిలించుకోవాల్సి వచ్చింది.

ప్రణయ్ కపూర్ అనే వ్యక్తి తన కారు పంక్చర్ అవ్వడంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ పంపుకు వెళ్లాడు. అక్కడ పంక్చర్ చేసే వ్యక్తి టైర్‌ను చెక్ చేశాడు. చెక్ చేశాక టైర్‌కు 4 పంక్చర్లు అయ్యాయని.. పంక్చర్‌కు రూ.300 చొప్పున రూ.1200 ఖర్చవుతుందని తెలిపాడు. దీంతో ప్రణయ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే టైర్‌ను వేరే షాపులో చెక్ చేయించాడు. అక్కడ ఒకే పంక్చర్ అయ్యిందని.. అయితే పెట్రోల్ పంపు వ్యక్తులు మరో 3 పంక్చర్లు చేసినట్లు చెప్పాడు. ఆ షాపు వ్యక్తి ముల్లు లాంటి ఒక పరికరాన్ని చూపించి.. ఎక్కువ డబ్బు కోసం కొంత మంది టైర్లకు హోల్స్ చేస్తారని చెప్పాడు. దీంతో ప్రణయ్ అవాక్కయ్యాడు.

పెట్రోల్ పంపులో సదరు వ్యక్తి చేసిన పనితో టైర్ మార్చాల్సి వచ్చిందని ప్రణయ్ వాపోయాడు. దీనికి రూ.8వేలు ఖర్చు అయినట్లు తెలిపాడు. ఈ విషయాన్నంత అతడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను చేసిన ఖరీదైన తప్పును ఎవరు చేయకూడదని అందులో తెలిపాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తమకు కూడా చాలా సార్లు ఇలాగే అయ్యిందని.. గుర్తించలేకపోయామని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ సహా ఎన్నో పట్టణాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పంక్చర్ కాకున్నా అయిదంటూ కేటుగాళ్లు జనాల డబ్బును లూటీ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *