Prasidh Krishna : టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ప్రసిధ్ కృష్ణ

Prasidh Krishna :   టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన ప్రసిధ్ కృష్ణ


Prasidh Krishna : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందంటే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. ఇప్పటివరకు కనీసం 500 బంతులు వేసిన పేస్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఎకానమీ రేట్ 5.28 గా ఉంది. ఇది టెస్ట్ చరిత్రలోనే అత్యధిక ఎకానమీ రేట్. సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ నుండి ప్రసిధ్ కృష్ణకు గట్టి సపోర్టు ఉంది. ఈ కర్ణాటక బౌలర్ డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచుతో ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుండి రెడ్-బాల్ ఫార్మాట్‌లో భారత్ తరపున చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేదు. అతను బ్యాటింగ్, బౌలింగులో అద్భుతంగా రాణిస్తాడని సెలక్టర్లు ఇతడిని ఎంపిక చేశారు.

మొదటి టెస్టులో కూడా అతను భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు అతడిని ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా జేమీ స్మిత్ ఒకే ఓవర్‌లో 23 పరుగులు రాబట్టి ప్రసిధ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. భారత సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఎంత మద్దతు ఇస్తున్నా, ప్రసిధ్ మాత్రం టెస్టుల్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. అతని కచ్చితత్వం లేకపోవడం, అనూహ్యమైన లైన్లు, లెంగ్త్‌లతో బౌలింగ్ చేయడమే ఈ చెత్త రికార్డుకు కారణం. ప్రసిధ్ కృష్ణ తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే, టెస్ట్ జట్టులో అతడి ప్లేస్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో తను మొదటి ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు ఇచ్చి, వరుసగా 3, 2 వికెట్లు తీశాడు. ఆ సమయంలో అతని ఎకానమీ రేట్లు 6.40, 6.13.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో అతను మంచి ఆరంభం ఇచ్చినట్లు కనిపించింది. మొదటి ఐదు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే, అతని పురోగతికి ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జేమీ స్మిత్ అడ్డుకట్ట వేశాడు. రెండో టెస్ట్‌లోని 32వ ఓవర్‌లో స్మిత్ ప్రసిధ్ బౌలింగ్‌లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. 2000 సంవత్సరం తర్వాత భారత బౌలర్ వేసిన అత్యంత ఖరీదైన ఓవర్లలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, కర్ణ్ శర్మ తర్వాత ప్రసిధ్ ఉన్నాడు.

లంచ్ విరామానికి ముందు 8 ఓవర్లు వేసిన ప్రసిధ్ కృష్ణ 61 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని ప్రస్తుత టెస్ట్ క్రికెట్ ఎకానమీ రేట్ 5.28గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే (కనీసం 500 బంతులు వేసిన పేస్ బౌలర్లలో) అత్యధికం. ఈ లిస్ట్‌లో వరుణ్ ఆరోన్, జహీర్ ఖాన్ వంటి బౌలర్లు కూడా ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ భారీగా 587 పరుగులు చేసిన తర్వాత, 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను జేమీ స్మిత్ (143)*, హ్యారీ బ్రూక్ (113)* సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ రికార్డు పార్టనర్ షిప్ నమోదు చేసి ఇంగ్లాండ్‌ను 62.2 ఓవర్లలో 313/5తో స్ట్రాంగ్ పొజిషన్ కు తీసుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *